Main Menu

Gollapudi columns ~ Tomotolu Ullipaayalu(టొమాటోలు – ఉల్లిపాయలూ)

Topic: Tomotolu Ullipaayalu(టొమాటోలు – ఉల్లిపాయలూ)

Language: Telugu (తెలుగు)

Published on: Aug 12, 2013

Tomotolu Ullipaayalu(టొమాటోలు - ఉల్లిపాయలూ)     

ఒక్కొక్కప్పుడు ఉద్యమాల వల్ల సాధించేవాటికన్నా ఉద్యమాల కారణంగా కలిసివచ్చే మేళ్లు -కొండొకచో రుచికరంగానూ, కడుపునింపేవిగానూ ఉంటాయి. అలాంటి సందర్భం -ఈ మధ్య చెన్నైలో కనిపించింది. అవేమిటి? టొమాటోలూ, ఉల్లిపాయలూ, అల్లం. ఎలాగో చెప్తాను. ఈ మధ్య ఉధృతంగా తెలుగుదేశంలో ఉద్యమం సాగుతోంది. ఎటునుంచీ లారీలూ, వాహనాలూ కదలడం లేదు.

ఉత్తరదేశం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి బయలుదేరిన లారీలు మదనపల్లి దాటి రాలేకపోయాయి. వెనక్కి వెళ్తే సరుకు మురిగిపోతుంది. కనుక తమిళనాడు చేరుకున్నాయి. తమిళనాడులో -ఒక్క చెన్నైకే ప్రతిరోజూ 40 నుంచి 50 లారీలు వస్తాయి. కాని ఈసారి మరో 15 లారీలు ఎక్కువ వచ్చాయి. అప్పుడేమయింది? కూరగాయల ధరలు పడిపోయాయి. టొమాటోలు అంతవరకూ కేజీ 32 రూపాయలకి అమ్ముతున్నారు. ప్రస్థుతం 18 రూపాయలకే దొరుకుతున్నాయి. అ లాగే అల్లం కేజీ 175 రూపాయలుండేది. ఇప్పుడు 80 రూపాయలకి దిగిపోయింది. అయినావరంలో కేవలం కేజీ 40 రూపాయలకే ఉల్లిపాయలు దొరుతున్నాయి. ఉద్యమాల వల్ల ఉపయోగం లేదని ఎవరనగలరు! ఇంకా పొరుగు రాష్ట్రాలకు ఉపయోగపడే పనులను ఆయా ప్రభుత్వాల నాయకులు చేస్తున్న ఎన్నో మేళ్లు ఉన్నాయి. ఉదాహరణకి -మేలురకం సన్నబియ్యం. ఆ మధ్య తమిళనాడులో డిఎంకె నాయకులు కరుణానిధిగారు కిలో రెండు రూపాయలకే పేద ప్రజలకి బియ్యం ఇచ్చారు. ఆ బియ్యం కూడా మేలురకం బియ్యాన్ని కొనుగోలుచేసి మరీ ఇచ్చారు. ఆ బియ్యం ఏమయింది? పొరుగు రాష్ట్రాలయిన ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రలకు లారీలకు లారీలే తరలిపోయాయి. సన్నబియ్యాన్ని తమిళ ప్రజలు సరసమయిన ధరలకు అమ్ముకుని -తమకి కావలసిన కాపుసారా, రొట్టెలు, మరేవో కొనుక్కుని సుఖపడ్డారు. అలాగే పేద విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు ఇచ్చారు. ఒక్క సైకిలుని -ఒక్క విద్యార్థి ఉపయోగించగా నేను చూడలేదు. సరసమైన ధరలకు చిన్న చిన్న ఉద్యోగులు కొనుక్కుని వాడుకున్నారు. అలాగే రంగు టీవీలను పేదలకు పంచారు. ఒకపక్క తాటాకు కప్పునుంచి వర్షం నీరు కురుస్తూండగా, బయట మురికి కాలువ కంపు దూసుకు వస్తూండగా పేదలు రంగు టీవీలలో సినిమాలు చూసి ఆనందించారా? వారంత తెలివితక్కువవారుకారు. సరసమయిన ధరలకు వాటిని అమ్ముకున్నారు. అదిన్నీ పక్క రాష్ట్రాలవారికి అమ్మారు. కారణం? స్థానికంగా అమ్మితే ప్రభుత్వం దృష్టికి వెళ్తుందని. ఇది గొప్ప రాజకీయ ఉద్యమం. తద్వారా పొరుగు రాష్ట్రాలకి జరిగిన మేళ్లు.

ఈ కాలమ్‌కి రాజకీయమైన రుద్దుడు ఏమీలేదు. టొమాటోలూ, ఉల్లిపాయలూ ఆంధ్రా వంట గదుల్లోనయినా, తమిళుల వంట గదుల్లోనయినా అవే ప్రయోజనాన్ని యిస్తాయని శెలవివ్వడమే ఉద్దేశం. ఓ ప్రాంతపు ఉద్యమం మరొక ప్రాంతపు వంటగదిదాకా ప్రయాణం చేసిందని తెలిసి ఆనందించడమే ఉద్దేశం. పేదవాడి గోడునీ, అతని కనీస దినసరి అవసరాల్ని కేంద్రం ఎలాగూ పట్టించుకోలేకపోతోంది. ప్రభుత్వం పెట్టిన ఆహార బిల్లు -ఇసుక తొక్కిడిగా గల్లాపెట్టెలు నింపుకుంటున్న రాజకీయ మాఫియాల పుణ్యమా అని అటకెక్కబోతోం ది. ఆ మధ్య చెన్నైలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో మా మనుమరాలిని చేర్చడానికి మా అబ్బాయితో కలిసి వెళ్లాను. నన్ను చూసి దూరం నుంచి ఇద్దరు కుర్రాళ్లు నవ్వారు. చెన్నైలో నన్ను పలకరించే కుర్రాళ్లు తెలుగువారే అయివుంటారని దగ్గరికి పిలిచాను. వారిద్దరిదీ హనుమకొండ. ఓ కుర్రాడి పేరు రాం భూపాల్‌రెడ్డి. సుబేదారి, హంటర్‌ రోడ్డు అడ్రసు. మా అబ్బాయి అక్కడ పుట్టాడు. ”వెల్‌కం సోదరా” అని ఆనందంగా పలకరించాడు మా అబ్బాయి. హనుమకొండలో కుర్రాడు చెన్నైలో ఎందుకు చదువుతున్నాడు? ఆంధ్రా ఉల్లిపాయ లు చెన్నై ఎందుకొచ్చాయి? అందుకే. అక్కడ గత మూడేళ్లుగా కుర్రాడి చదువు సాగడం లేదేమో. ఒక కుర్రాడి జీవితంలో మూడేళ్లు ఎంత విలువయినవో తండ్రికి తెలుసు.

బహు శా ఆ తండ్రి హనుమకొండలో ఏ చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడో. ఇక్కడ బిడ్డని చదివించడానికి కనీసం మూడు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది. అతనికాస్థోమతు ఉందా? లేకపోయినా కొడుకు జీవితాన్ని ఓ దారి పట్టించడానికి వేరేమార్గం ఉందా? నిస్సహాయంగా ఆ తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని కొడు కు చదువుకోసం కష్టపడుతున్నారేమో. ఎన్నో ఆలోచనలు. ఒక ఉద్యమ ప్రభావం ఉల్లిపాయలో కనిపిస్తుందా? పక్క రాష్ట్రానికి పోవలసిన కుర్రాడి చదువులో ప్రతిఫలిస్తుందా? పొరు గు రాష్ట్రానికి చేరే మేలురకం బియ్యంలో కనిపిస్తుం దా? మూడు ఉదాహరణలు. మూడు మీ మాంసలు. మూడు లక్ష్యాలు. మూడు పర్యవసానాలు. మూడు ప్రభావాలు. మూడు వేర్వేరు కారణాలు. మూడు వత్తిడులు. ఉద్యమం ఒక ఆదర్శం. ఉల్లిపాయ ఒ క చిన్న ప్రభావం. ఇది ఉద్యమాన్ని ప్రశ్నించదు. కాని ఒక ప్రాం తపు ఆవేశం మరొక ప్రాంతపు కంచాన్ని, అవసరాన్ని తీర్చడం, ఒక ప్రాంతపు జీవిత లక్ష్యానికి మరొక ప్రాంతం ఆసరాకావడం అసంకల్పితమైన, యాదృచ్ఛికమైన సందర్భం. అంత మట్టుకే ఈ కాలమ్‌ పరిమితి.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.