గర్జించు రష్యా!
గాండ్రించు రష్యా!
పర్జన్యశంఖం పలికించు రష్యా!
దౌర్జన్యరాజ్యం ధ్వంసించు రష్యా!
లేలే, రష్యా!
రా రా, రష్యా!
రష్యా! రష్యా! రష్యా! ఓ రష్యా!
వ్యక్తి స్వతస్సిద్ధ స్వాతంత్ర్యదాతా!
పతిత నిర్గతిక ప్రపంచత్రాతా!
భావికాల స్వర్ణభవన నిర్మాతా!
లేలేలే రష్యా!
రా రా రా, రష్యా!
రష్యా! రష్యా! రష్యా! రష్యా
పుష్కిన్, గోగోల్, షెకోవ్, టాల్ స్టాయ్,
డోస్టోయ్ వస్కీ, గోర్కీ, కూప్రిన్
శిల్పసమ్రాట్టులై
జీవితం మధియించి,
పాప పంకం నుండి పద్మాలు పుట్టించి,
కార్మిక స్వర్గాన్ని కలగన్న రష్యా!
రష్యా! రష్యా! రష్యా! నా రష్యా!
మార్క్స్, ఎంగెల్స్ మహాప్రవక్తలై
బుఖారిన్, బకూనిన్, క్రోపోటికిన్,
భావాల కోలాహలంతో
మానవ పురోగమన మార్గాలు తెరువగా
లెనిన్ తపస్సు,
స్టాలిన్ సేద్యం
జ్వలించిన, ఫలించిన సముజ్జ్వల తేజం!
యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రాజ్యం
స్వాతంత్ర్య శత్రువుల గుండెల్లో బల్లెం!
పర పీడనాపరుల ప్రాణాల బైరవి!
రా రా రా, రష్యా
లే లే లే, రష్యా!
రష్యా! రష్యా! రష్యా! ఓ రష్యా!
ఈ అగ్ని వర్షాలు,
ఈ రక్తపాతాలు,
ఎలాగూ వచ్చాయి, ఏమయితే కానీ’
ఈ సవన రంగంలో ఎగరనీ జీవాలు!
ఈ సమరం తుది చూడక
ఇక నిలిచి పోరాదు!
తిరుగులేని ప్రతిజ్ఞ తీసుకో రష్యా!
పెట్టుబడి కూటాలు కట్టుకడుతున్నాయి!
కుట్రలు, కూహకం చెలరేగుతున్నాయి!
అసత్య ప్రచారపు రేడియో బాకా,
రాజకీయాలలో రంకు వేషాలు,
మరఫిరంగులు తెచ్చి మందిచ్చి, రష్యా!
విమాన బాహువులు విసురుతూ, రష్యా!
అనంత ప్రపంచం అంతటా నీవై
నీ గొడుగు నీడల్ని సాగించు రష్యా!
స్వతంత్రత, సమానత సాధించు రష్యా!
రష్యా! రష్యా! రష్యా! ఓ రష్యా!
సుప్తకంకాళాలు మేలుకొంటున్నాయి!
ప్రపంచం పడగెత్తి బుసకొట్టి లేచింది!
కార్మికులు, కర్షకులు, తాడితులు, పీడితులు,
కెరటాలుగా పొంగి తిరగబడుతున్నారు!
ప్రపంచం నీ కొసం పరిపక్వంగా వుంది!
కోటి గొంతులు నిన్నుకొరి రమ్మన్నాయి
కోటిచేతులు నిన్ను కౌగిలిస్తున్నాయి!
సై అంటూ రష్యా!
జై అంటూ రష్యా!
లే లే లే రష్యా!
రా రా రా రష్యా!
రష్యా! రష్యా! రష్యా! ఓ రష్యా!
Awaiting Contribution.
No comments yet.