Main Menu

Gollapudi columns ~ Pinnala Kosam (పిన్నలకోసం!!.)

Topic: Pinnala Kosam (పిన్నలకోసం!!.)

Language: Telugu (తెలుగు)

Published on: Jan 10, 2019

Pinnala Kosam (పిన్నలకోసం!!.)     

నేను విరివిగా సినీమాలు చేస్తున్న రోజుల్లో ఒకసారి మా ఆవిడతో ఊరు వెళ్లడానికి తెల్లవారు జామున మద్రాసు ఎయిర్‌పోర్టులో ఉన్నాను. ఎవరో నా భుజం తట్టారు. తిరిగి చూస్తే ఖాదర్‌ ఖాన్‌. మా ఇద్దరికీ మందు పరిచయం లేదు. కానీ ఆయన నా పాత్రలు చాలా చేస్తున్నారని విన్నాను. ఆయన హార్థికంగా పలకరించి ‘నేను ఖాదర్‌ ఖాన్‌. హిందీలో మీ పాత్రలు చేస్తున్నాను’ అన్నారు. నేను పులకించాను. ‘మీరు గొప్ప నటులు, నా పాత్రలు చెయ్యడం నాకు గొప్ప’ అన్నాను. అలా ఒక్కసారే నేనూ ఆయనా కలిశాం. ఆయన నాకంటే ఒక్క సంవత్సరం పెద్ద. చాలా రోజులుగా చాలా ఇబ్బందికరమైన రుగ్మతలతో బాధపడుతున్నారు. పిల్లలు కెనడాలో ఉన్నారు.

అక్కడే ఏడు నెలలు ఆసుపత్రిలో ఉండి కన్నుమూశారు. మొన్న ఆయన జీవిత దృశ్యాలను చూపుతూ కెనడా ఆసుపత్రి బయట పోర్టికోలో ఒంటి మీద కేవలం ఓవర్‌ కోటు ఉన్న నిస్సహాయుడైన ఖాదర్‌ఖాన్‌ని కొడుకులు, సన్నిహితులూ దింపుతున్నారు. ఆయన దిగ లేక దిగలేక కాలు నేల మీదకి మోపుతున్నాడు. నాకు చర్రున కళ్లనీళ్లు తిరిగాయి. ఆయన్ని చూసికాదు. ఆయన పిల్లలు తండ్రిని అంత భద్రంగా, పువ్వులాగ చూసుకుంటున్నందుకు. నేనక్కడే ఉంటే ముందుకు ఒంగి ఆ పిల్లలకు పాదాభివందం చేసేవాడిని.

ఓసారి ప్లేన్‌లో అమెరికాలో పనిచేస్తున్న తెలుగు అభిమాని నా పక్కన కూర్చున్నాడు. ‘సాయంకాలమైంది’ నవల కథ చెప్పాను. అతని తల్లిదండ్రులు ఇండియాలో ఉన్నారు. అతను అమెరికాలో. చాలాసార్లు వచ్చి చూసి పోతూంటాడు. అమెరికా డాలర్లు వస్తూంటాయి. కానీ ఏం లాభం? విమానం దిగే సమయానికి అతని కళ్లనిండా నీళ్లు నిండాయి. చాలా సంవత్సరాల కిందటి మాట. నా ‘సాయంకాలమైంది’ నవల చదివి లక్ష్మీకాంత శర్మ అనే ఒక ఐటీ టెక్నోక్రాట్‌ ఫోన్‌ చేశారు తన్మయత్వంతో. నా ‘సాయంకాలమైంది’ నవలని తిరుపతి వెళ్లి కొని తెచ్చుకున్నాడట. వరంగల్లు దగ్గర కాళే శ్వరం అనే గ్రామంలో అతని తండ్రి అర్చకుడు. నవల చదివాక తల్లిదండ్రులతో ఉండాలని విదేశాలలో ఉద్యోగాలు వచ్చినా వదులుకుని ఇండియాలో ఉండిపోయాడు.

మహాభారతంలో ఓ కథ. తపస్సు చేసి అపూర్వ శక్తులు సంపాదించిన ఓ తపస్వి గర్వపడుతూ సభ్య ప్రపంచంలోకి వచ్చాడు. భర్తకి సేవ చేస్తున్న ఓ ఇల్లాలు నవ్వి ఆ మూల దుకాణం నడుపుతున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి ఈ అపూర్వ శక్తుల్ని ధిక్కరించే వైభవాన్ని చూసి రమ్మంది. అది ధర్మవ్యాధుడి మాంసం దుకాణం. జంతువుల్ని నరికి, కోసి అమ్ముకుంటున్నాడు. ఇతనికీ, ధర్మానికీ సాపత్యమేమిటి? నిర్ఘాంతపోయాడు తపస్వి. తీరా వ్యాపారం ముగిశాక ధర్మ వ్యాధుడు ఆయన్ని ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంట్లో ముదుసలి తల్లిదండ్రులు. వారికి నిష్టతో సేవ చేస్తున్నాడు. ‘ఇదే నాకు తెలిసిన ధర్మ రహస్యం’ అన్నాడు ధర్మవ్యాధుడు.

మతాన్ని పాతగుడ్డల్లో చుట్టి అటక మీద పారేసిన మేథావులున్న ఈ దేశంలో మతం దేవుళ్లు, పురాణాల రూపేణా మోక్షాన్ని ‘ఎర’గా చూపిందిగానీ, పరోక్షంగా సామాజిక జీవనానికి బంగారు బాటలు వేసింది. పండరీపురంలో పాండురంగ విఠల్‌ ప్రాశస్త్యానికీ మూల సూత్రమదే. ఈ మాట నాకు పండరీపురంలో ఓ పేరు, భాషా తెలీని భక్తుడు చెప్పాడు. విఠల్‌ అంటే మహారాష్ట్ర భాషలో ‘ఇటుక’ అని అర్థం (ట). పాండురంగడు మహా దైవ భక్తుడు. తల్లిదండ్రుల్ని సేవిస్తున్న కొడుకు. తీరా దేవుడు అతని పిలుపు విని వచ్చాడు. ఆ సమయానికి పాండురంగడి ఒడిలో తల్లదండ్రుల పాదాలున్నాయి. దేవుడు ‘నేను వచ్చానయ్యా’ అన్నాడు. పాండురంగడు ఆనం దించి చుట్టూ చూశాడు.

ఓ ఇటుక కనిపించింది. ఆ ఇటుకని దేవుడివేపు గిరాటేసి ‘ధన్యుణ్ణి స్వామీ, అమ్మానాన్నకి సేవ చేస్తున్నాను. కాస్సేపాగండి. ఈ ఇటుక మీద విశ్రమించండి. సేవ ముగించుకు వస్తాను’ అన్నాడుట. స్వామి ఇటుక మీద కూర్చోలేదు. భక్తుడి తల్లిదండ్రుల సేవ ముగిసే వరకూ ఆ ఇటుక మీద నిలబడే ఉన్నాడట. ఇది కథో, ఇతిహాసమో నాకు తెలీదు. కానీ ఆముష్మికాన్నీ, దేవుడినీ జీవనానికి సంధించిన అపూర్వమైన కాన్సెప్ట్‌. తమిళ సినీ రచయిత కన్నదాసన్‌ ఒక అద్భుతమైన పాట రాశారు.

‘జీవితంలో అందరికీ అన్ని విధాలా రుణం తీర్చుకోగలను. కానీ, నేను పోయాక నన్ను శ్మశానానికి మోసుకుపోయే ఆ నలుగురి ఉపకారానికీ ప్రతిక్రియ చెయ్యలేను. వారికి నా ప్రణామాలు’ అంటారు.

గొప్ప రచయిత, గొప్ప నటుడి గొప్ప జీవితం ప్రపంచం చప్పట్లని ఓ జీవితకాలం సంపాదించు కుంది. కానీ వృద్ధాప్యంలో కెనడా ఆసుపత్రి ముందు దిగే ఓ నిస్సహాయుడికి ఆసరా ఇచ్చే బిడ్డల చేతులు ఓ సమాజ సంస్కారానికీ, ఓ వ్యవస్థ నివాళికీ–వెరసి అతను సంపాదించుకున్న వరం.
Life is an achievement but old age is a gift.

నిస్సహాయతకు చెయ్యి సాయం సంస్కారం. చెయ్యి యోగం.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.