Main Menu

Gollapudi columns ~ 49 O

Topic: 49 O

Language: Telugu (తెలుగు)

Published on: May 20, 2013

49 O     

నిన్నకాక మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికలు ఎన్నో కొత్త విషయాల్ని చెప్పక చెప్తున్నాయి. ఇప్పటికే రాజకీయ నాయకులకీ, దేశానికీ అర్థమయ్యే విషయం -చదువుకున్న వాడి దగ్గర్నుంచి, మామూలు మనిషి వరకూ రాజకీయ పార్టీల నైచ్యాన్నీ, నమ్మకద్రోహాన్నీ, అవినీతినీ, బుకాయింపునీ, నిరంకుశత్వాన్నీ, గూండాయిజాన్నీ, దోపిడీని, రంకుతనాన్ని గమనిస్తున్నారని, అసహ్యించు కుంటున్నారని. అవకాశం వచ్చినప్పుడల్లా స్పష్టంగా తమ అసహ్యాన్నీ, అసహనాన్నీ ప్రకటిస్తున్నారని. అయితే ఇందులో -‘ప్రజాస్వామ్యం పేరిట మరో పెద్ద లొసుగు ఉంది. దాన్ని చర్చించే ముందు కొన్ని నిజాలు. 1985 తర్వాత పదవిలో ఉన్న ఏ పార్టీనీ కర్ణాటకలో ప్రజలు ఎన్నుకోలేదు. ఈ మధ్యకాలంలో అదేపనిని తమిళనాడు ఓటరూ నిష్కర్షగా చేస్తున్నాడు. ఈసారి కరుణానిధి పార్టీ పదవిలోకి వస్తే రేపు జయలలిత పార్టీ వస్తుంది. పదవిలో ఉన్నప్పుడు ఆయా పార్టీల అవినీతినీ, అరాచకాన్నీ ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూనే ఉన్నాడు. అయితే అయిదేళ్ల తర్వాత మళ్లీ వారినే ఎందుకు ఎన్నుకుంటు న్నాడు? మరో గతిలేక. ప్రతీసారీ పదవిలో ఉన్న పార్టీ పట్ల విముఖత -ఎదుటి పార్టీ పట్ల సుముఖతగా చలామణీ అవుతోంది. పదవిలోకి వచ్చిన పార్టీ కొన్నాళ్లు నీతికథలు చెప్తుంది. మళ్లీ తన భాగోతం మొదలెడుతుంది. ఎంతవరకు? మళ్లీ చీదరించుకుని, నిష్కర్షగా, నిర్ధుష్టంగా వోటరు పొమ్మనే వరకూ.

ప్రస్థుతం కర్ణాటక భాగోతమే తీసుకుం దాం. బిజెపి అవినీతి, అరాచకం, వీధినపడి పార్టీలు చీల్చుకోవడం, అన్నీ వోటరు చూస్తూనే ఉన్నాడు. గాలి భాగోతం దేశం కళ్లారా చూసిం ది. కాని తన విసుగుదల, కోపం ప్రదర్శించ డానికి అయిదు సంవత్సరాలు ఆగక తప్పదు. ఈలోగా మనచుట్టూ జగన్‌లు ఉంటారు. వాన్‌పిక్‌ ప్రసాదులుంటారు. గాలి సోదరులుం టారు. వారు నీతిగురించి మాట్లాడుతూనే ఉంటారు.

కర్ణాటకలో బిజెపిని గద్దె దించి కాంగ్రెస్‌ని ఎక్కించడానికి కాంగ్రెస్‌ మీద ముద్దొచ్చికాదు. వారి భాగోతాలు కోకొల్లలు. ఎన్నికల విజయం చవిచూస్తూండ గానే మరో రైలు గేటు, మరో సిబిఐ అధికార దుర్వినియో గం -ఇద్దరు మంత్రు ల బర్తరఫ్‌ జరిగింది. మరెందుకు ఎన్నుకొన్న ట్టు? మరో గతిలేక. (అందుకే ‘అవినీతి నాయకుల్ని గద్దెదింపే చట్టం రావాలని అన్నా హజారే మొత్తుకుంటున్నది). ఎదుట ఉన్న దరిద్రుడూ, దానవు డూ మధ్య ఎవరినో ఎన్ను కు చావాలి కనుక. ప్రజాస్వా మ్యంలో ఈ అనర్థం తప్పదా? ఒకరు పోతే మరొకరిని తెలిసీ చంక ఎక్కించుకునే దరిద్రానికి ప్రత్యామ్నా యం ఏదయినా ఉందా?

ఉంది బాబూ! ఉంది. ఇలాంటి ఆలోచన ఉంది. ఇది మన దేశంలో ప్రతీ వోటరుకీ తెలియజెప్పాల్సిన రోజొచ్చింది. దాని పేరు 49 ఓ. 2001 లోనే వోటరు తన అభీష్టం మేరకి అందరు అభ్యర్థులనూ తిరస్కరించే అవకాశం కల్పించాలనే ప్రతిపాదన వచ్చింది. 2004లో అప్పటి ఎన్నికల కమిషనర్‌ టి.ఎస్‌.కృష్ణమూర్తి గారు (ఆయన తెలుగువారు. సాహితీ ప్రియు లు. నాకు మిత్రులు) ప్రధానమంత్రికి ఒక ప్రతిపాదనని చేశారు. ఎన్నికకి నిలబడే ఏ అభ్యర్థీ వోటరుకి నచ్చకపోతే? ఇప్పటి బాలెట్‌ కాగితంలో అభ్యర్థుల జాబితా మాత్రమే ఉంటుంది. అంటే వోటరుకి ఎవరికో ఒకరికి వోటు వేసే అవకాశమే ఉంటుంది. కనుక, బాలెట్‌ కాగితంలో ఆయా అభ్యర్థుల పేర్లతో పాటు -”వీళ్లెవరినీ ఎన్నుకోను” అని వోటరు చెప్పగలిగే ఒక కాలమ్‌ ఉండాలని ప్రతిపాదిం చారు. రష్యాలో ఈ నెగిటివ్‌ వోటుకి ఆస్కారం ఉంది. ఈ దేశంలో ఇప్పటి నాయకుల నిర్వాకం దృష్ట్యా, నానాటికీ పెరుగుతున్న వోటరు నైరాశ్యం దృష్ట్యా అందరినీ తిరస్కరించే హక్కు వోటరుకి ఉండాలి. ఈ మాటే అన్నా హజారే చెప్తున్నారు.

ఎవరికీ వోటు చేయని హక్కు తన విసుగుదలని అందరిపట్లా -లేదా ఈ నాయకుల ఆత్మవం చన పట్ల ప్రదర్శించే హక్కు ఉండాలని. అయితే ఈ ప్రతిపాదన మీద ఒక విమర్శ కుడా ఉంది. దేశంలో ప్రతీ వోటరూ తన అభిప్రాయాన్ని ప్రకటించే అవకాశం ఎన్నిక. కోట్లు ఖర్చు చేసే ఈ ప్రక్రియ ‘ఎవరూ నచ్చలేదు’ అనే మెజారిటీ అభిప్రాయంతో ముగిస్తే? అయితే అవినీతిపరుడిని గద్దె ఎక్కించి -అయిదేళ్లు అతని దోపిడీని, అరాచకాన్ని (ఇప్పుడు సుప్రీం కోర్టు దాకా వెళ్లిన అవినీతి భాగోతాలని చూస్తున్నా ము కదా?) భరించే ఖర్చుకన్న -మెజారిటీ ప్రజానీకం నైరాశ్యాన్ని, నిర్దుష్టమైన విసుగుదల ని తెలిసేటట్టు చేయడం కొందరికయినా కనువిప్పు కాదా అని ఆశ. ఈ రెండు నష్టాల్లో ఏది ఎక్కువ నష్టమో చూద్దాం. మన దేశంలో ఎన్నిక నిర్వహించడా నికి పది వేల కోట్లు ఖర్చవుతుం ది. సరే. ఒక అవినీతిపరుడిని నాయకుడిగా అయిదేళ్లు భరిస్తే? ఒక్క రాజావారి 2జి కుంభకోణంలోనే లక్షా డెబ్బైయ్యారు వేల మూడువందల డెబ్బై తొమ్మిది కోట్లు తిన్నారు. బొగ్గు కుంభకోణంలో 1855.91 బిలియన్లు స్వాహా చేశారు. ఇలాంటివి -ఒక్క యూపీఏ 2లోనే పది కుంభకోణాలున్నాయి. స్పెక్ట్రమ్‌ కుంభకోణం, కామన్వెల్త్‌ క్రీడల కుంభకోణం, తెల్గీ కుంభకోణం, సత్యం కుంభకోణం, బోఫోర్స్‌ కుంభకోణం, బీహారు గడ్డి కుంభకోణం, ఆదర్శ అపార్ట్‌మెంట్ల కుంభకోణం, హవాలా కుంభకోణం (18 వేల కోట్లు చేతులు మారాయి!), ఐపీఎల్‌ కుంభకోణం, హర్షద్‌ మెహతా, కేతన్‌ పారీఖ్‌ కుంభకోణం, చివరగా జగన్‌ వ్యవహారంలో ఇంకా లెక్కలు తేలలేదు. ఇవి చాలనుకుంటాను -49 ఓ కారణంగా -అవినీతి పరుడిని అందలం ఎక్కించేకన్నా పదివేల కోట్లని వోటరు గర్వంగా, నిష్కర్షగా, కుండబద్దలుకొట్టి -నాకీ దరిద్రులు ఎవరూ వద్దని చెప్పడానికి, జీవితంలో మళ్లీ వాళ్ల మొహం చూపకుండా చేయడానికి.

ఒకవేళ ఎన్నికయిన అభ్యర్థికి వచ్చిన వోట్ల కన్నా -వోటరు తిరస్కరించిన వోట్ల సంఖ్య ఎక్కువయితే? ఆ అభ్యర్థిని శాశ్వతంగా ఎన్నికలలో నిలవకుండా బర్తరఫ్‌ చేయవచ్చుననే ఆలోచన ఉన్నది. అయితే అలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాని ఇలాంటి అవకాశమే యిస్తే ఈ దేశంలో ఎంతమంది నాయకుల నుంచి సమాజాన్ని కాపాడవచ్చును?

ఈ దేశంలో మహిళల రిజర్వేషన్‌ లాగా, దేశస్థాయిలో లోకాయుక్త లాగ, 49 ఓ ని శాసనం చేసే అవకాశం -పిల్లి మెడలో మరో పిల్లి గంట కట్టడం లాంటిది. సీబీఐ ని జేబులో పెట్టుకుని పార్టీల్ని బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ, తమ అవినీతికి తామే నీతిసూత్రాల్ని నిర్దేశించే ఈనాటి నాయకత్వం 49 ఓ కి స్వాగతం పలుకుతుందనుకోవడం కొంతదురాశే. అందుకు ‘లీడర్‌’లో నా పాత్రే సాక్ష్యం. తమని బర్తరఫ్‌ చేసే చట్టాన్ని తెలిసి తెలిసి వారే ఎందుకు చేస్తారయ్యా పిచ్చివాడా! అని ముఖ్యమంత్రిని నిలదీస్తుంది నా పాత్ర. ప్రభుత్వం చెయ్యలేని, చెయ్యని పనిని తలవొంచి చేయించే న్యాయస్థానం ఉండడం నేలబారు మనిషికి కొంత ఊరట. ఏనాటికయి నా ఈ దౌర్భాగ్యులనుంచి విముక్తి కలగదా అని ఒక ఆశ.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.