Main Menu

Gollapudi columns ~ Anni Unnavade Emilenivaadu(అన్నీ ఉన్నవాడే ఏమీలేనివాడు)

Topic: Anni Unnavade Emilenivaadu(అన్నీ ఉన్నవాడే ఏమీలేనివాడు )

Language: Telugu (తెలుగు)

Published on: Nov 05, 2012

Anni Unnavade Emilenivaadu(అన్నీ ఉన్నవాడే ఏమీలేనివాడు)     

ఇంటర్నెట్ లో చాలా మంది మిత్రులు – ప్రపంచం అన్ని మూలల నుంచీ రకరకాల కథలు, సందర్భాలను ఉటంకిస్తూంటారు. ఇది నలుగురితో పంచుకోవలసినంత గొప్ప సగతి:

1923 లో అమెరికాలోని చికాగోలో ఉన్న ఎడ్జి వాటర్ బీచ్ హోటల్ లో దేశంలో కల్లా శ్రీమంతులైన తొమ్మిది మంది కలుసుకున్నారు. వాళ్ళందరి ఆస్తుల్ని కలిపితే ఆనాటి అమెరికా దేశపు సంపద కన్నా ఎక్కువ. డబ్బుని ఎలా సంపాదించాలో, ఎలా కూడబెట్టాలో వంటబట్టించుకున్న మహానుభావులు వీరు తొమ్మిది మంది.
అసలు వీళ్ళెవరు? 1. దేశంలో కల్ల పెద్ద స్టీలు కంపెనీ ప్రెసిడెంటు. 2. దేశంలో కల్లా పెద్ద వినియోగ వస్తువుల కంపెనీ ప్రెసిడెంటు. 4. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ ఛేంజి అధ్యక్షుడు. 5. అంతర్జాతీయ వాణిజ్య బాంకు ప్రెసిడెంటు. 6. దేశంలో కల్లా పెద్ద గోధుమ కొనుగోలు వ్యాపారి. 7. వాల్ స్ట్రీట్ లో షేర్ల వ్యాపారం చేసే అతి పెద్ద వ్యాపారి. 8. అప్పటి ప్రపంచంలో కల్లా పెద్ద పెట్టుబడిదారీ సంస్థ అధ్యక్షుడు.

ఏ దేశంలోనయినా, ఎక్కడయినా, ఎప్పుడయినా ఇంతకన్నా శ్రీమంతుల జాబితాను మనం చూడలేము.

కానీ, 25 సంవత్సరాల తర్వాత వీరంతా ఎలావున్నారు? ఆ ప్రశ్నకంటే ముందు వీరికేమయిందో తెలుసుకోవడం మంచిది.

ఆనాటి అతి పెద్ద స్టీలు కంపెనీ (బెత్లెహాం స్టీల్ కార్పో రేషన్) ప్రెసిడెంటు చార్లెస్ స్వాబ్ అయిదేళ్ళు అప్పుల పెట్టుబడితో వ్యాపారం చేసి బికారిగా చచ్చిపోయాడు. దేశంలో కల్లా పెద్ద గాస్ కంపెనీ ప్రెసిడెంటు హోవర్డ్ హబ్నన్ పిచ్చివాడయాడు. దేశంలో కల్లా పెద్ద గోధుమ కొనుగోలు వ్యాపారి ఆర్ధర్ కాటన్ బికారి అయాడు. అంతర్జాతీయ వాణిజ్య బాంకు ప్రెసిడెంటు రిచర్డ్ విట్నీ జైలుకి వెళ్ళాడు. అమెరికా ప్రెసిడెంటు హార్డింగ్ మంత్రి వర్గ సభ్యుడు జైలు నుంచి కోర్ట్ ద్వారా విడుదలని పొంది ఇంటి దగ్గర ప్రాణాలు వదిలాడు. వాల్ స్ట్రీట్ లో షేర్స్ వ్యాపారి జెస్సీ లివర్ మోర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రపంచంలో కల్లా పెద్ద పెట్టుబడిదారీ సంస్థ అధ్యక్షుడు ఇవార్ క్రూగర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతర్జాతీయ వాణిజ్య బాంకు ప్రెసిడెంటు లియోన్ ఫ్రేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. దేశంలో కల్లా పెద్ద వినియోగ వస్తువుల కంపెనీ ప్రెసిడెంటు దామ్యూల్ ఇన్నెల్ చేతిలో చిల్లిగవ్వలేక కన్నుమూశాడు.

వాళ్ళు జీవితంలో డబ్బుని కూడబెడుతూ జీవించి, అసలు జీవనానికి అవసరమయిన విలువల్ని మరిచిపోయారు. డబ్బు ఎన్నటికీ కీడు చెయ్యదు. ఆకలి గొన్నవాడికి అన్నం పెడుతుంది. అనారోగ్యంతో ఉన్నవాడికి చికిత్స చేయిస్తుంది. బట్టలేనివాడికి గుడ్డనిస్తుంది. డబ్బు మన జీవనోపాధికి కేవలం ఒక పరికరం. ఒక ఊతం. అవసరం.
మనకి రెండు రకాలయిన అవగాహనలు కావాలి. 1.జీవితాన్ని ఎలా గడపాలి? జీవితాన్ని ఎందుకు గడపాలి? మనలో చాలామంది డబ్బుని సంపాదించే యంత్రాలుగా మారిపోతారు. భార్య, పిల్లల శ్రేయస్సు, వారి ఉనికి, సాంఘిక బాధ్యతలు మరుగున పడిపోతాయి. “ఎందుకయ్యా ఈ డబ్బు?” అని ఎవరినయినా అడగండి. “నా కుటుంబం కోసం” అని సమాధానం

కానీ ఎక్కడుంది ఆ కుటుంబం? నువ్వు ఇల్లు వదిలేముందు నీ పిల్లలు నిద్రలేవలెదు. నువ్వు ఇల్లు చేరేతప్పటికి నీ పిల్లలు మేలుకుని లేరు. ఇరవైయ్యేళ్ళ తర్వాత వాళ్ళంతా వాళ్ళ మానాన వాళ్ళు వెళ్ళిపోతారు – వాళ్ళ వాళ్ళ బతుకులు బతకడానికి, వాళ్ళ ఆశయాలను నెరవేర్చుకోడానికి. నువ్వు కట్టిన ఇల్లు, నీ అనారోగ్యం, నీ సంపద – అవసరంలేని, ఎందుకో అర్ధం కాని సంపద – నీతో ఉంటుంది. ఏం చేస్తావు దాన్ని? ఇప్పుడు జెస్సె లివర్ మోర్ ఎందుకు నిస్పృహ లో పడ్డాడో, హోవర్డ్ హబ్స్న్ ఎందుకు పిచ్చివాడయాడో కాస్త అర్ధమౌతూ ఉంటుంది.

నీరు లేనిదే ఓడ నడవదు. కానీ ఓడనిండా నీరు నిండితే ఓడకి ప్రమాదం. నీరు ఉండవలసినచోట, ఉండవలిసినంతే ఉండాలి. ఇంకా ముఖ్యం – ఉంచాలి. లేకపోతే ప్రయాణం సాగదు. ఓడ మునిగిపోతుంది.

సంపాదన అవసరమే. కానీ అదే మన మనస్సంతా ఆక్రమించుకోరాదు. కావలసినంత మాత్రమే నింపుకుని – మిగతా మనస్సులో మీ భార్యా, పిల్లలు, చుట్టూ ఉన్న సమాజం – ఇందరికి చోటిస్తే – జైళ్ళు, పిచ్చాసుపత్రిల అవసరం ఉండదు. ప్రయాణం సజావుగా సాగుతుంది. ప్రపంచంలో కల్లా అనూహ్యమైన సంపదని ఆర్జించి – దయనీయంగా చచ్చిపోయిన తొమ్మిది మంది శ్రీమంతులు తాము చచ్చి మనం ఎలా బతకాలో చెప్పే నీతికథ ఇది.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.