Main Menu

Gollapudi columns ~ Annjanammakunivali (అంజనమ్మకునివాలి)

Topic: Annjanammakunivali (అంజనమ్మకునివాలి )

Language: Telugu (తెలుగు)

Published on: Jan 20, 2014

Annjanammakunivali(అంజనమ్మకునివాలి )     

నా జీవితంలో మొదటిసారిగా – నా ఎనిమిదో ఏట – విశాఖపట్నం మినర్వా టాకీసులో అంజనమ్మని చూశాను. ఆ సినీమా ‘బాలరాజు ‘. అందులో ప్రముఖంగా ముగ్గురు నటీనటులు – అక్కినేని, ఎస్.వరలక్ష్మి, అంజలీదేవి. నా అదృష్టం ఏమిటంటే – నా జీవితంలో ఆ ముగ్గురితోనూ నటించే అవకాశం కలిసి వచ్చింది. మరో 14 సంవత్సరాలకు అక్కినేని కంపెనీ అన్నపూర్ణా సంస్థ ద్వారా సినీరంగ ప్రవేశం చేసి వారికి సంభాషణలు రాశాను. తర్వాతి కాలంలో వారితో ఎన్నో చిత్రాలలో నటించాను. ఎస్.వరలక్ష్మిగారు నా కంటే తేలికగా 11 సంవత్సరాలు పెద్ద. కనీసం నాలుగు చిత్రాలలో మేమిద్దరం భార్యాభర్తలుగా నటించాం. “శ్రీవారు” సినీమా ఆమె నన్ను గదమాయించి నా కాళ్ళకు నమస్కారం పెట్టడంతో ప్రారంభమవుతుంది. అంజనమ్మగారు నాకంటే పన్నెండేళ్ళు పెద్ద. రెండు చిత్రాలలో అక్కా తమ్ముళ్ళం. ఒక చిత్రంలో నేను ప్రతినాయకుడిని.

నా చిన్నతనం నుంచీ అంజమ్మగారి చిన్నతనాన్ని చూస్తున్నా నాకేమో ఆమెలో ఎప్పుడూ పెద్దతనమే కనిపించేది. కొందరు యువకులు పుట్టుకతోనే వృద్ధులు – అన్నారు శ్రీశ్రీ. ఆ మాట విమర్శగా కాక అభినందనగా అంజమ్మకి వర్తిస్తుంది. ఆమె ముఖంలో ఆర్ద్రత, ఓ ప్రసన్నత కనిపిస్తుంది. విచిత్రం ఏమిటంటే అంజనమ్మ తొలిచిత్రాలలో వాంప్ పాత్రల్ని నటించడం. “పల్లెటూరి పిల్ల”నాటికి హీరోయిన్ గా ఎన్నో రకాల పాత్రలు చేసినా అంజమ్మగారు తెలుగు ప్రేక్షకులకి సీతమ్మ.

కన్నాంబని చూడగానే హుందాతనం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. శ్రీరంజని ఆర్ధ్రతకు పెట్టింది పేరు. అంజమ్మ పవిత్రతకి. సావిత్రి ఏ మూసకూ లొంగదు. ఏ పాత్రలోనయినా తనదయిన ప్రత్యేకతతో ఒదిగిపోతుంది.

పెద్దాపురం నుంచి వచ్చిన పదేళ్ళ అంజనమ్మని నూకయ్యగారనే ఆమె పెద్దదిక్కు ఆదినారాయణగారి దగ్గర వదిలారు – నాటకాల్లో ప్రవేశాన్ని కల్పించమని. ఆయన సైకిల్ హాండిల్ మీద కూర్చుని నాటకశాలకు వచ్చేది. ఆయనకప్పటికే పెళ్ళయింది. కానీ కోరి, పంతం పట్టి ఆయన్నే చేసుకుంది. తొలినాటి ఆమె అనుభవమంతా కాకినాడ యంగ్ మెన్స్ హాపీ క్లబ్బు. గండికోట జోగినాధం, రేలంగి, ఎస్వీ రంగారావు, ఆదినారాయణ ప్రభ్రుతులకి అది ఆటపట్టు. 1937 – 40 మధ్య ఆమెకి నెలకు వందరూపాయలు జీతమని గర్వంగా చెప్పుకునేవారు. ఆనాటి వంద ఇప్పుడు లక్షలకి సాటి. “స్ట్రీట్ సింగర్స్” అనే నాటకంలో ఎస్వీ రంగారావుగారూ, అంజనమ్మగారూ ఆ రోజుల్లో నటించారు. 1939 లో “కుచేల” ఆమె మొదటి నాటకం.

చాలా సంవత్సరాల క్రిందట – పి.సాంబశివరావుగారి దర్శకత్వంలో మాధవీ ఫిలింస్ ప్రసాద్ గారు ఒక చిత్రాన్ని ప్లాన్ చేశారు. అప్పటికి 50 సంవత్సరాల ముందు నటించిన ప్రముఖ దర్శకులు కె.ఎస్.ప్రకాశరావుగారు అతి బలవంతం మీద ఆ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. మరి అంత పెద్దాయనకి భార్యగా ఎవరు వేయాలి? అంజలీదేవిగారిని పిలిచారు. మరి ఆవిడ తమ్ముడు వేషానికి ఎవరు? నన్ను పిలిచారు. ఆ తర్వాత శాఖమూరి రామచంద్రరావుగారి “పోరాటం”, చెరుకూరి ప్రకాశరావుగారి “మానవుడే మహనీయుడు” చేశాను.

అలనాటి (1956) ఎల్వీ ప్రసాద్ గారి “ఇలవేలుపు” చిత్రంలో అక్కినేని సరసన నటించిన నటీమణి అతి హుందాగా కేరెక్టర్ పాత్రలవేపు ప్రయాణం చేశారు. “మానవుడే మహనీయుడు” చిత్రంలో హీరో అక్కినేని. అంజమ్మగారిది కేరక్టరు పాత్ర. కథనాది.

ఆమె చేసిన “సువర్ణసుందరి” “అనార్కలి” వంటి చిత్రాలు ఇతిహాసాల స్థాయిలో నిలిచిన చిత్రాలు. ఆమె భర్త సంగీత దర్శకత్వానికీ తలమానికంగా నిలిచిన కళాఖండాలు. ఆయన బాణీలకు ఆమె మొదటి శ్రోత. ఆమె అంగీకారం ఆ పాటకి తూకపురాయి. ఈ దాంపత్యం భారతీయ సినీమాలోనే అనన్యం. బహుశా గురుదత్, గీతారాయ్ కొంతమేరకు జ్నాపకం వస్తారు. అలనాటి ఆమె పాత్రలు ఆయా సినీమాలను ఒక అలౌకికమైన epics. నేడు కధలూ, పాత్రలూ, సన్నివేశాలూ – వాస్తవికత పేరిట నేలబారుగా – నేలకంటే బారుగా మారిపోయాయి. కానీ ఆ రోజుల్లోఅంజలీదేవి వంటి నటీమణులు వెండి తెరకు ఒక eerie అనుభూతిని సంతరించిన నటీమణులు. అందుకనే ఆమె ‘సీత ‘ ఇప్పటికీ ప్రాణం పోసుకుని మనకు దర్శనమిస్తుంది. ఈ మధ్య సినీమాలో కనిపించిన సీత పక్క ధియేటర్ లోనే నేలకు జారిపోయే పాత్రలో సీత ఇమేజ్ ని ఛిన్నాభిన్నం చేస్తుంది. “బైబిల్” సినీమాలో ఏసుప్రభువుగా నటించిన నటుడు మరే పాత్రవేయడానికీ ఒప్పుకోలేదట. సినీరంగం నుంచి శాశ్వతంగా తొలిగిపోయాడు – ఒకే పాత్రకి శాశ్వతత్వాన్ని సంతరిస్తూ. సీత పాత్ర చేసిన అంజలీదేవి ఆ పాత్రీకరణ ఇమేజ్ కి భంగం కలిగించే ఏ పాత్రనీ తర్వాతి కెరీర్ లో చెయ్యలేదు. ప్రేక్షకుల మనస్సుల్లో అనుభూతి నటుడు సంపాదించుకున్న ఆస్తి. దాన్ని అంజలీదేవి ఏనాడూ దుబారా చెయ్యలేదు.

చిత్తూరు నాగయ్యగారి పేరిట ఆవిడ అనేతృత్వంలో ఒక ట్రస్టుని ఏర్పాటు చేసి ఏటేటా ఒక సంస్మరణ సభని జరిపేవారు. ఓసారి ఆ సభకి ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తూ అంజమ్మగారు నాకు ఫోన్ చేశారు. కానీ మరేదో పని అడ్డుపడి వెళ్ళలేకపోయాను.

ఆమె ఆఖరి రోజులు – ఆమె వ్యక్తిత్వానికి తగ్గట్టుగానే సత్యసాయిబాబా సేవలో జరిగిపోయాయి. చాలామంది ఇవ్వలేనంత ఆస్తిని ఆమె పుట్టపర్తికి సమర్పిం చుకున్నారు. ఆమె వ్యక్తిత్వాన్నీ, ఆరోగ్యాన్నీ చక్కగా పోషించాయి.

వెండితెర పాత్రమీద తప్పనిసరిగా ఆ నటుని వ్యక్తిత్వ ప్రభావం ఉంటుంది. అలాగే పాత్ర స్వభావం వ్యక్తిమీదా ఉంటుంది. “శంకరాభరణం”లో శంకరశాస్త్రి పాత్రని ధరించిన జె.వి.సోమయాజులుగారు సిగరెట్టు కాల్చడాన్ని అమెరికాలో అతి విడ్డూరంగా చూసేవారు. మరి “కొండమీద కొక్కిరాయి” వంటి పాటలు పాడే తొలినాటి వాంప్ పాత్రలు చూసినా అంజనమ్మని తెలుగుదేశం సీతమ్మగానే అక్కున చేర్చుకుంది. అంటే ఆమెలో ప్రసన్నత – ఆయా పాత్రల వెగటుదనాన్ని ఉపశమింపజేసింది. అది ఆమె అదృష్టం. తెలుగు దేశం అదృష్టం కూడా.

మిత్రుడు, దుక్కిపాటి అల్లుడు జగదీష్ చంద్ర ప్రసాద్ కి నేను మొదటి చిత్రం రాశాను. నిజానికి ఆ చిత్రంలో ప్రధాన పాత్ర ఎస్వీ రంగారావుగారిది. కాని మొదటి షెడ్యూలు అవుతూనే ఆయన కాలం చేశారు. మేమంతా గతుక్కుమన్నాం ఏం చెయ్యాలో తోచక. సినీరంగమంతా. సినీరంగమంతా వెదికినా ఆయనకి ప్రత్నామ్నాయం మాకు తట్టలేదు. ఇమేజ్ లో కాకపోయినా ప్రతిభలో, గాంభీర్యంలో ఆయనకు ప్రత్యామ్నాయమనదగిన నటి ఒక్కరే తోచారు – అంజలీదేవి. ఆ పాత్రని స్త్రీని చేసి అంజలీదేవిగారి చేత చేయించాం. ఆ సినీమా పేరు “చల్లని తల్లి”. ఆ మాట నిజానికి పాత్రకే కాదు ఆ నటికీ వర్తిస్తుంది.

75 సంవత్సరాల పాటు గుండెలనిండా జ్నాపకాలను, పాత్రీకరణలనూ, ఉదాత్తతనూ, ఆత్మీయతనూ పంచిన “చల్లనితల్లి” అంజలీదేవి.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.