Main Menu

Gollapudi columns ~ Maggi Yagi(మాగీ యాగీ)

Topic: Maggi Yagi(మాగీ యాగీ)

Language: Telugu (తెలుగు)

Published on: July 02, 2015, Sakshi (సాక్షి) Newspaper

Maggi Yagi(మాగీ యాగీ)     

వ్యాపారానికి విశ్వాసం పెట్టుబడి. మనకు తెలియని సమాచారాన్ని, మనకు తెలిసిన, మనం అభిమానించిన వ్యక్తి తెలియచేయడమే ప్రక టన. బజారులో అమ్మే మిఠాయి తినవద్దంది అమ్మ. అటు వేపు కూడా చూడం. బజారులో ఉన్న ఫలానా పకోడీ బాగుంటుందన్నాడు పక్కింటాయన. ‘ఆయనెవరయ్యా చెప్పడానికి?’ అంటాం. ఇంకా, పక్కింటాయన మీద కోపం ఉంటే పకోడీ తిని మరీ ఆయన మాట తప్పని నిరూపిస్తాం. ప్రకటనకు పెట్టుబడి ఆ పెద్దమనిషి పరపతి. ‘పెద్దమనిషి’ అంటున్నాను కాని, ‘సినీ నటుడు’ అనడం లేదు. కారణం ఈ మధ్య ఎస్.పి. బాలసుబ్రహ్మ ణ్యం, సిరివెన్నెల, మనూ కూడా ప్రకటనల్లో పాల్గొంటున్నారు. ఆయా వ్యక్తుల పట్ల ప్రజల అభిమానం, విశ్వాసం ఆ ప్రకటనకు దన్ను. పిండికొద్దీ రొట్టె.

మరీ బొత్తిగా ముఖం తెలియని వ్యక్తులతో ప్రకటనలు- చాలా సందర్భాలలో వారి అందమో, మాటలో ఆటలో చమత్కారమో కారణం కావచ్చు. కత్రినా కైఫ్, జెనీలియా, ప్రీతీ జింటా మొదలైనవారు ప్రకటనల ద్వారా వెండితెరకు వచ్చినవారు. ఇర్ఫాన్ ఖాన్, ఓం పురీ లాంటి వాళ్లు వెండితెర ద్వారా ప్రకటనలలో జొర బడినవారు. దేనికైనా పరపతి, ప్రచారమే ముఖ్యం.

బొత్తిగా ప్రకటనల వ్యవహారం తెలియనివారు కొందరు ఈ మధ్య నన్ను అడిగారు: ‘‘అయ్యా! ఒక నిముషం ప్రకటన సినీమాలో నటించడానికి అంత డబ్బు ఎందుకండీ?’’ అని. చూడడానికి ఇది విపర్యంలాగే కని పిస్తుంది. కాని ఇందులో తిరకాసు ఉంది. బండగా చెప్పాలంటే ‘సినీమా’ నూనె తయారు చేసే గానుగ. ప్రకటన- సీలు వేసి నూనెను సూపర్ మార్కెట్‌లో అమ్మే దుకాణం. సినీమా పెట్టుబడి. ప్రకటన కరెన్సీ. ప్రకట నకు ఎక్కువ డబ్బు ఇచ్చేది – వ్యవధిని బట్టి కాదు. ఆ వ్యక్తి పరపతిని బట్టి. ‘‘మీరు ఖరీదు చేసేది ఆ నిమిషాన్ని కాదు. డబ్బు చేసుకొనేది – మున్ఫై సంవత్సరాలు ఆ నటుడు కూడబెట్టుకున్న పరపతిని. అమితాబ్ బచ్చన్ చేతిలో కొంగమార్కు పళ్లపొడి పొట్లం ఉంటే కోటి మంది దాన్ని గుర్తిస్తారు. అప్పలకొండ అనే వ్యక్తి చేతిలో ప్రపంచ ప్రఖ్యాత టూత్‌పేస్ట్ ట్యూబు ఉంటే పక్కవాడు కూడా గుర్తించడు.

ఎన్.టి. రామారావుకి వేసే ఓటు ఆయన నిరూపించిన ఒక జీవితకాలపు సంప్రదాయం పట్ల చూపే విశ్వాసం. స్క్రీన్‌ప్లే రచనలో బండసూత్రం- తెలియని విషయాన్ని తెలిసిన మార్గంలో పరిచయం చెయ్యాలి. మరొక్కసారి – గుర్తింపుకి ‘విశ్వాసం’ పెట్టుబడి. కావాలనే ఈసారి ‘వ్యాపారం’ అనడం లేదు.

అమితాబ్ బచ్చన్ తెరమీద తొడుక్కోమన్న చెప్పుల్ని మనం తొడుక్కుంటున్నామంటే అర్థం-మనకి తెలిసిన, మనం అభిమానించే, మనం నమ్మిన ఓ వ్యక్తి మన లాగే ఆ పని చేసి తృప్తి చెందాడు కనుక. అమితాబ్ బచ్చన్ చెప్పుల తయారీలో డిగ్రీ సంపాదించినవాడని కాదు. ‘‘ఈ కారు అద్భుతం’’ అని మనకు తాళాలు చూపించే హిందీ నటుడు షారుక్‌ఖాన్‌ని ‘‘ఏమయ్యా! నువ్వెప్పుడైనా ఆటోమొబైల్ కోర్సు చేశావా?’’ అని ఎవరైనా అడిగారా?

ఇప్పుడు అసలు కథ. అలా అడగాలా? వద్దా? దేశ మంతా ఆవురావురుమని తింటున్న మాగీ నూడుల్స్ గొప్పవని, మంచివని ముగ్గురు తారలు మనకు చెప్పా రు. అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతీ జింటా. గత 30 సంవత్సరాలుగా దేశమంతా తింటోంది. ఇప్పు డు మాగీ నూడుల్స్‌ను చాలా రాష్ట్రాలు బహిష్కరించా యి. నెస్లే సంస్థే ఆ సరుకుని ఈ దేశం నుంచి ఉపసంహరించింది.

ఇందులో సినీతారల బాధ్యత ఎంతవరకు ఉంది? ప్రపంచమంతటా వ్యాపారం చేస్తున్న ఓ కార్పొరేట్ సంస్థ సరుకుని ఆ సంస్థ పరపతి దృష్ట్యా అంగీకరించి- బోలెడంత డబ్బు పుచ్చుకుని ప్రకటనలు ఇవ్వడం ఎంత వరకు సమంజసం? ఇందులో మోనోసోడియం గ్లుటా మేట్ పాలు ఎక్కువ కావడం వల్ల రక్తహీనత, మోతాదు మరీ మించితే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని అమి తాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతీ జింటా తెలుసు కోవలసిన అవసరం ఎంతవరకు ఉంది?

వారి మీద కేసులు నమోదయ్యాయి. తీరా వాద ప్రతివాదాలు జరుగుతాయి. తమ విశ్వాసాన్ని పెట్టుబ డిగా వ్యాపారం చేస్తున్న ఒక వ్యాపారి సరుకుని ఏమాత్రం మంచిచెడ్డలు తెలుసుకోకుండా సమర్థించడం నేర మే కదా! అయితే 30 సంవత్సరాలు తెలుసుకోవలసిన, తెలియజెప్పవలసిన జాతీయ సంస్థకే ఈ నిజం తెలియలేదు కదా! అయితే అది సమర్థించుకునే ‘కారణం’ అవుతుందా?

విశ్వాసాన్ని పెట్టుబడిగా వినియోగించుకుంటున్న వ్యాపారికీ, దాన్ని డబ్బు చేసుకుంటున్న ‘సినీతార’కీ సామాజిక బాధ్యతల పాళ్లు ఎంతవరకూ ఉన్నాయి? ఇది నీతికీ, న్యాయానికీ, చట్టానికీ కొరుకుడు పడని విచికిత్సే. విచారణ, న్యాయవాదుల వాదనలూ ఆసక్తిక రంగా ఉండక తప్పవు.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.