Main Menu

Gollapudi columns ~ Sthithapragnudu (స్థితప్రజ్ఞుడు)

Topic: Sthithapragnudu (స్థితప్రజ్ఞుడు)

Language: Telugu (తెలుగు)

Published on: Jan 27, 2014

Sthithapragnudu (స్థితప్రజ్ఞుడు)     

51 సంవత్సరాలుగా అక్కినేనిని అతి సమీపంగా చూస్తున్నవాడిగా, 65 సంవత్సరాలుగా ఆయన చిత్రాలని అభిమానిస్తున్నవాడిగా -అక్కినేనిలో అతి విచిత్రమైన విపర్యయాలు కనిపిస్తాయినాకు. ఆయన దేవుడిని నమ్మరు. ఆయన యింట్లో గోడలకి దేవుడి పఠాలను చూసిన గుర్తులేదు. కాని దేవుడి పాత్రల్నీ, భక్తుల పాత్రల్నీ ఆయన నటించిన తన్మయత్వం, తాదాత్మ్యం అపూర్వం. కాళిదాసు, తుకారాం, నారదుడు, విప్రనారాయణ, భక్త జయదేవ -యిలా ఎన్నయినా ఉదాహరణలు మనస్సులో కదులుతాయి. ఆయనకి బొత్తిగా నచ్చనిది -సానుభూతి. ఎక్కువగా ఆశించనిది -పొగడ్త. అమితంగా ప్రదర్శించనిది -ఆర్ద్రత. వీటన్నిటికీ లొంగే ఎన్నో సందర్భాలూ, సంఘటనలూ ఆయన జీవితంలో ఉన్నాయి. మనిషిలో వ్యగ్రతకీ, వ్యధకీ అతి సహజమయిన ఆటవిడుపు కన్నీరు. నిజజీవితంలో అక్కినేని కన్నీరు కార్చిన గుర్తులేదు. వెండితెరమీద కన్నీరు కార్చని అక్కినేని సినీమా నాకు గుర్తులేదు -ఏ మిస్సమ్మ, చక్రపాణి వంటి చిత్రాలనో మినహాయిస్తే. అయితే ఒక్క సందర్భాన్ని ఆయనే పదే పదే సభల్లో చెప్పిన గుర్తుంది. ఆయన పెద్దబ్బాయి వెంకట్‌కి చికిత్స చేయడానికి వచ్చిన డాక్టరు వెంకయ్యగారు కుర్రాడిని బతికించి వెనక్కి వెళ్తూ కారు ఏక్సిడెంట్‌లో మరణించారు. అప్పుడు ఆయన భోరుమన్నారు. తర్వాత ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. అది వేరే కథ. ఆర్ద్రతనీ, గుండె చప్పుళ్లనీ అంత నిర్దుష్టంగా, అంత మనస్ఫూర్తిగా ఒప్పించిన నటుడు మరొకరు కనిపించరు. ఃమెలోడ్రామాః తెరమీద ఆయనకి ఆయుపు పట్టు. నిజజీవితంలో అది ఆవలిగట్టు. మరొక గొప్ప లక్షణం -ఈ 51 సంవత్సరాలలోనూ నేను గమనించినది మరొకటి ఉంది. పదిమందీ ఎదిరించడానికీ, లోనవడానికీ వణికిపోయే గడ్డు సందర్భాలను అధిగమించే సాహసాన్ని -గర్వంగా, గొప్పగా, ధైర్యంగా పూనుకునే అసాధారణమైన శక్తీ, ఉద్ధతీగల వ్యక్తి అక్కినేని. నాలాంటి వారిని ఆశ్చర్యపరిచే విషయం -అర్ధరాత్రి తనని లేవదీసుకుపొమ్మని గదికి వచ్చిన అమ్మాయిని వెన్కకి పంపి, తీరా వేళ మించిపోయాక గుండె పగిలి మందుకు బానిసయిన ఃదేవదాసుః ఈయనేనా అనిపిస్తుంది -అది ఆయన నటించిన పాత్రయినా. ఆ స్వభావం ఆయనది కాదు. పాత్రది. ఆ పాత్రని భారతదేశంలో అనితర సాధ్యంగా ఒప్పించిన వ్యక్తి అక్కినేని. అంటే ఆయన వ్యక్తిగత స్వభావం నుంచి అధ: పాతాళానికి, స్వయం నాశనానికి కృంగిపోయే రేంజ్‌ని 60 ఏళ్ల కిందటే ఒడిసిపట్టుకున్న మహానటుడు.

విషయానికి దూరం వచ్చాను. డెబ్బైయ్యో దశకంలో ఆయనకు బైపాస్‌ జరిగినప్పుడు -అదెంత క్లిష్టమయిందో, విచిత్రమైందో అక్కినేని మా అందరికీ గంటలకొద్దీ చెప్పడం గుర్తుంది. మొన్న కేన్సర్‌ వచ్చినప్పుడు -ఆయనే పత్రికలవారిని పిలిచి కేన్సర్‌ కణాలు వయస్సు ముదురుతున్నకొద్దీ ఎలా బలహీనపడతాయో వివరించి చెప్పారు! దాదాపు 30 సంవత్సరాలు అన్నపూర్ణమ్మగారు కీళ్లనొప్పులతో బాధపడినా ఎప్పుడు అడిగినా -ఆయన నొసలు కాస్త ముడుత పడేది కాని -ఒక్కనాడూ నిస్పృహ పెదాలు దాటేదికాదు. నా షష్ఠిపూర్తికి -అంటే అప్పటికి ఆయనకి యిప్పటి నావయస్సు -విశాపట్నం కళాభారతిలో వేదిక మెట్లు దిగడానికి రెండుసార్లు చెయ్యి అందించబోయాను. రెండుసార్లూ నా చెయ్యి విదిలించుకున్నారు. మూడోసారి అందించబోతే ఃఃముందు మీరు దిగండిఃః అన్నారు. నేనిప్పుడు నిస్సంకోచంగా చెయ్యికోసం చుట్టూ ఎదురుచూస్తున్నాను. జీవితంలో కష్టాన్నీ, నష్టాన్నీ, కన్నీళ్లనీ, నిస్పృహనీ -తనచుట్టూ 75 సంవత్సరాలు ముసురుకున్న కోట్లాది ప్రజానీకానికి ప్రయత్నపూర్వకంగా కాక, స్వభావరీత్యా దూరంగా పంచిన స్థితప్రజ్ఞుడు. కాని తన వ్యక్తిగతమయిన కష్టాలమీదా, నష్టాలమీదా నిరంకుశంగా తెరదించడం, నిర్దుష్టంగా ముసుగు వేయడం ఓ నటుడికి సాధ్యమయే పనికాదు. ప్రయత్నించకపోయినా అతని కళ్లు వర్షించగలవు. పెదాలు వణక గలవు. గొంతు గాద్గదికం కాగలదు. కాని వీటికి వేటికీ లొంగని ఆత్మవిశ్వాసం, Self Pity-కి లొంగని Non-chalance అక్కినేని సొత్తు.

నేనెప్పుడూ నామీద ఆయనకి అభిమానం ఉన్నా, ఆయనపట్ల నాకెంతో గౌరవం ఉన్నా ఆయన్ని పూసుకు తిరగలేదు. కాని కేన్సర్‌ అని తెలిశాక ఒక్కసారయినా వెళ్లి ఆయన్ని పలకరించాలని మనస్సు పీకింది. కాని ఈ దశలో ఆయన ఎవరినీ చూడడానికి యిష్టపడడం లేదేమో! అలా చూడడం వారి సన్నిహితులకు యిష్టం లేదేమో! అలాంటి సానుభూతి నచ్చని వ్యక్తి ఆ క్షణంలో కుంచించుకపోతారేమో. సాహసం చెయ్యలేకపోయాను. కాని ఒక్కటి మాత్రం మనసులో కదిలేది. తన దు:ఖానికీ, తన వేదనకీ గర్వంగా తెరదించిన ఈ మహానటుడు చివరి రోజుల్లో భరించరాని వేదనకీ, చూడలేని దైన్యానికీ లొంగిపోతారేమోనని బాధ కలిగేది. కేన్సర్‌ ఎలాంటి వజ్ర కవచాన్నయినా ఛేదించే భయంకరమైన వ్యాధి. కాని -విచిత్రం! కేన్సర్‌కీ ఆయన లొంగలేదు. 44 సంవత్సరాల క్రిందటి నుంచే అలసిపోయిన ఆయన గుండె ఆయనకి కలిసివచ్చింది. కేన్సర్‌ నించి, దాని దుర్మార్గం నుంచి ఆయన గాంభీర్యాన్ని హుందాతనాన్ని రక్షించింది. కేన్సర్‌ని మోసం చేసింది. అక్కినేని అనే ఓ గొప్ప Objective Personality కి అద్భుతమైన ముగింపు రాసింది. రాత్రి పిల్లలందరితో నవ్వుతూ భోజనం చేసి -అర్ధరాత్రి కేన్సర్‌ని నిద్రపుచ్చి -అలవోకగా, నిశ్శబ్దంగా శలవు తీసుకున్నారు అక్కినేని. ఆయన నిర్దుష్టమయిన హుందా జీవితానికి ఆ ముగింపు ఓ గొప్ప హంసగీతి.

ఆయన స్థితప్రజ్ఞుడు. మృత్యువునీ తన షరతుల మీదనే, తన పరిధులలోనె ఆహ్వానించే యోధుడాయన. జీవితమంతా నటనని ఆరాధించిన మహానటుడు -భరించరాని వ్యధనీ, వ్యగ్రతనీ దాటే దగ్గర తోవలో అంతే హుందాగా, అంతే గర్వంగా నిష్కృమించారు. ఈ దశలో -ఒక్కసారయినా -ఆయన నమ్మని, ఆయన టిప్పణిలో లేని ఒక్కమాటని వాడాలనిపిస్తోంది. ఆయన యోగి. ఇలాంటి మృత్యువు యోగులకు మాత్రమే దక్కే ముగింపు. ఈ మాటని సమర్థించడానికి సాక్ష్యం నా దగ్గర ఉంది. ఇక్కడ చాలామంది గుర్తించని విషయం -అదే రోజున -అంటే పుష్య బహుళ పంచమినాడు 157 సంవత్సరాల కిందట నాదయోగి త్యాగరాజస్వామి కన్నుమూశారు. రెండు రంగాలలో ఇద్దరు యోగుల నిష్క్రమణకి ఆ రోజు సంకేతం. పుష్య బహుళ పంచమినాడే హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జన్మించడం కూడా విశేషమే!

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.