Main Menu

Gollapudi columns ~ Avinitiki Pattabhisekam (అవినీతికి పట్టాభిషేకం)

Topic: Avinitiki Pattabhisekam (అవినీతికి పట్టాభిషేకం)

Language: Telugu (తెలుగు)

Published on: Jan 04, 2010, Andhra Prabha(ఆంధ్రప్రభ)

Source Credit: koumudi.net

Avinitiki Pattabhisekam (అవినీతికి పట్టాభిషేకం)     

మన దేశంలో అవినీతి అద్భుతమైన పరిణామం చెంది అపూర్వమయిన కళగా స్థిరపడినట్టు మరే దేశంలోనూ లేదు. నిజానికి దొంగతనం కూడా మన పెద్దలు అంగీకరించిన 64 కళలలో ఒకటి.

అది పాతకాలం మాట.ఈ రోజుల్లో అవినీతి అనలేని, అనకుండా ఉండనూలేని ఎన్నో రకాలయిన కొత్త కొత్త అవినీతులు వచ్చాయి. వాటికిశిక్షలు ఉండవు. జవాబుదారీ ఉండదు. చెల్లుబాటవుతుంది. అవినీతి పరుడికి మేలు జరుగుంది. నీతినిద్రపోతుంది. కాని ఎవరూ ఏమీ చెయ్యలేరు.

ఆ మధ్య ఓ ఆస్థి రిజిస్ట్రేషన్ కి 30 లక్షలు కార్పొరేషన్ కి కట్టవలసి వుంది. కట్టకుండా తప్పించుకొనే మార్గాలు ఓ”పెద్దమనిషి” సూచించాడు. శాశ్వతంగా కట్టకుండా తప్పించుకోవాలని వుందా? కొన్నాళ్ళ వరకూ విసులుబాటు కలిగితే చాలా? లేక కార్పొరేషనే దీనిని మాఫీ చేసే ఏర్పాటు కావాలా? ఆయా పనులకి వేర్వేరు రేట్లున్నాయి. నేను ఆశ్చర్యపోయాను.ఎలా? తాత్కాలికంగా మీకు విసులుబాటు కావాలంటే కొన్నాళ్ళపాటు ఆ ఫైలుమరో కేసు ఫైలులో కలిసిపోతుంది.మళ్ళీ మనకి అవసరమైనప్పుడే బయటపడుతుంది.అలాక్కాక శాశ్వతంగా సమస్య పరిష్కారం కావాలంటే డిపార్టుమెంటులోంచి ఫైలు మాయమయిపోతుంది శాశ్వతంగా. బహుశా ఆ గుమాస్తాగారి వంట గదిలోకి. భగవంతుడు కూడా దాన్ని కనిపెట్టలేడు. ఫైలు ఏమయింది? కనిపించడం లేదు సార్! అంతే. దానికి అప్పీలు లేదు. దీనికి ఎవరిని శిక్షించాలి? చస్తే ఎవరూ నిర్ణయించలేరు.ఓ పని జరగకుండా చూడడానికి వంద రకాల సాకులు గుమాస్తాల వద్ద ఉంటాయి. ఫైలు మీద ఇంకు వొలికిపోతుంది. ఎవరు ఒంపారు? తెలీదు.అక్షరాలు కనిపించడంలేదు. అంతే. కింద వాడు పంపిన వివరణలో ఒక పేజీ లేదు. ఆరునెలలు ఆ ఫైలు నిలిచిపోతుంది.

రుచిక కేసు 19 సంవత్సరాలు సాగడానికి, సజ్జన్ కుమార్ మీద కేసు పెట్టడానికి సీబీఐకి ఇంతవరకూ అనుమతి లభించకపోవడానికీ- మీ యిష్టం – ఈ కేసులకి కోర్టులకి కూడా అందని అవినీతి వేళ్ళు చాచుకుని ఉంది. రాధోడ్ గారు రుచికని మానభంగం చేశాడనడానికి సాక్ష్యం వుంది. ఆమె ఆత్మహత్య చేసుకుందనడానికి ఆమె శవమే వుంది. కాని ఆయన ఫలానా వ్యక్తిని రెచ్చగొట్టడం వల్ల ఫలానా పని జరిగిందని, అది పరోక్షమయిన కారణంగా రుచిక ఆత్మహ్య చేసుకుందని దేవుడు కూడా నిరూపించలేరు. రుచిక తండ్రి చెప్పేవి వెయ్యి నిజాలు. రాధోడ్ లాయరు చెప్పేవి వెయ్యి లొసుగులు. అవి కోర్టులకి కనిపిస్తాయి. రుచిక తండ్రి దుఃఖమే కన్పిస్తుంది. రాధోడ్ దుర్మార్గం ఎటు లాగినా ముడిపడదు. కనుక ఎప్పుడూ రాధోడ్ గారు బెయిల్ ని అనుభవిస్తూనే వుంటారు. రుచిక తండ్రి ఎప్పుడూ నిస్సహాయంగా కుమిలిపోతూనే వుంటాడు. ఇది లోక ధర్మం కాకపోవచ్చు. కాని భారతదేశ ధర్మం. మనం మనుషుల్లాగ సమస్యల్ని చూసి స్పందిస్తాం. కాని న్యాయస్థానం సాక్ష్యాల్ని మాత్రమే చూడ గలుగుతుంది.

ఇప్పుడో సరదా అయిన కధ. నేనొకసారి ఓ స్మగ్లర్ దగ్గర ఓ టీవీని కొన్నాను.కొన్ని వారాల తర్వాత నేను హైదరాబాదులో షూటింగ్ లో వుండగా మా ఆవిడ హడావుడిగా ఫోన్ చేసింది. కస్టంస్ అధికారులు మా యింటి మీద దాడి చేసి ఆ టీవీని పట్టుకున్నారు. వారికెలాతెలిసింది? అదే సరదా అయిన విషయం. మాకు టీవీని అమ్మిన స్మగ్లరే వారికి సమాచారం యిచ్చి వారి దగ్గర పారితోషికం తీసుకున్నాడట. నేను నివ్వెరపోయాను. మా మిత్రుల ద్వారా కస్టంస్ కలెక్టరుగారిని కలిశాను. ఆయన తెలుగాయన. నా కధ విని పగలబడి నవ్వాడు. “మిమ్మల్ని పట్టించినందుకు మేమే ఆ స్మగ్లర్ కి బహుమతి యిచ్చాం అన్నారాయన.ఇది అన్యాయం కదా అని మొత్తుకున్నాను. అప్పుడాయన ఓ లోక ధర్మాన్ని నాకు భోధించాడు. “బాబూ! మేమేనాడూ అవినీతి వ్యాపారిని పట్టుకోలేం. కాని ఆ వ్యాపారాన్ని ప్రోత్సహించే మిమ్మల్ని పట్టుకోగలం. మీకు అడ్రసు ఉంది. కాని స్మగ్లర్ కి అడ్రసు లేదు. మిమ్మల్ని శిక్షించడం ద్వారా అతని మార్కెట్ ని మాయం చేసి తద్వారా నేరాన్ని అరికట్టగలం” ఇదీ ఆ అధికారి నాకు చెప్పినవిషయం.

“అంతకంటే ఆ దౌర్భాగ్యుడిని అరెస్టు చెయ్యవచ్చుకదా?”అన్నాను కోపంగా.

చెన్నైలోకస్టమ్స్ ఆఫీసు ఎదురుగానే బర్మా బజారు దొంగ రవాణా షాపులన్నీ ఉన్నాయి. ఆయన కిటికీలోంచి బయట షాపుల్ని చూపిస్తూ “అక్కడ మా కళ్ళముందే అవినీతి జరుగుతోందని మాకు తెలుసు.మీకు నలుగురు మనుషుల్ని యిస్తాను.ఫలానా వ్యక్తి నేరం చేశాడని పట్టి తీసుకురండి. సాధ్యం కాదు.ఎందుకో తెలుసా? ఆ వస్తువు ఎవరిదో నిరూపించలేరు. ఇతను కొన్నాడని రుజువు చెయ్యలేరు. దొంగతనంగా అమ్ముతున్నాదని రుజువు చెయ్యలేరు. అసలు అతని పేరు “అసిఫ్”అనడానికి మీ దగ్గర రుజువులేమైనా ఉన్నాయా? అందుకురుజువు అతని పుట్టిన సర్టిఫికేటా? ఏ స్కూల్లోనయినా చదివాడా? అతని పాస్ పోర్ట్ లో ఏం పేరు వుందో- అనలితనికి పాస్ పోర్టు వుందో లేదో మీకు తెలుసా? వీటిలో ఏ ఒక్కటి నిరూపించ లేకపోయినా ఈ కేసు నిలవదు. నిలపలేమని అతనికి తెలుసు .ఒక్కో సరుకుకి కొనుగోలుదారునికి ఒక్కో పేరు చెప్తాడు. చెప్పాడని మాకు తెలిసేటట్టు చేస్తాడు. మేమేమీ చెయ్యలేమని, ఈ ఒక్క టీవీ కేసుతో మేం కోర్టుకి వెళ్తే కొన్ని సంవత్సరాలునడుస్తుందనీ, ఇలా కొన్ని వందల సరకుల మీద కొన్ని వందల కేసులు నడిపే శక్తి మాకు లేదని వాళ్ళకి తెలుసు. ఈ వలలో దొరికే చేప, నిజాయితీగా బతికే కొనుగోలుదారుడు. క్షమించాలి. ఇది కారడివిలో క్రూరమృగం నీతి. మీమీద జరిమానా వెయ్యక తప్పదు. ఈమాటు టీవీ కావాలంటే నాకు చెప్పండి. మేం పట్టుకున్న సరకుల్ని మీకు అమ్ముతాం” అన్నాడు ఆ అధికారి.

నేను నిస్సహాయంగా –రుచిక తండ్రిలాగ- దొంగ సరుకు కొన్నందుకు వ్రాతపూర్వకంగా క్షమాపణ చెప్పి ఇంకెప్పుడూ ఇలాంటి పని చెయ్యనని చెంపలు వేసుకుని,జరిమానా కట్టి బయటికి వచ్చాను.

నాకు సరుకుని అమ్మిన డబ్బును, నన్ను పట్టించినందుకుబహుమతినీ సంపాదించిన ఫలానా స్మగ్లర్ నేను కస్టమ్స్ ఆఫీసు మెట్లు దిగడాన్ని జాలిగా చూసి నవ్వుకుంటూంటాడు.

ఈ దేశంలో చెల్లిపోయే అవినీతి, చెల్లించుకునే అవినీతి, నిరూపించలేని అవినీతి, నిస్సహాయంగా తలవొంచాల్సిన అవినీతి, నిలదొక్కుకున్న అవినీతి, నిలదీసే అవినీతి, పబ్బం గడుపుకునే అవినీతి-ఇలా కోకొల్లలు ఉన్నాయి. నిజానికి ఒకే ముఖం. అబద్దానికి అరవై ముఖాలు.

వ్యవస్థ శీలం మంట గలిశాక మనకి ఫైళ్ళు మాయం చేసే గుమాస్థాలూ, మానభంగాలు చేసి చెల్లుబాటు చేసుకునే అధికారులు, నిజం తెలిసినా నిస్సహాయంగా పెదవి విరిచే అధికార యంత్రాంగం- యివే మిగులుతాయి.

శిక్షలు అందరూ అనుభవిస్తున్నారు. కాని చికిత్స మరెక్కడో ప్రారంభం కావాలి.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.