Main Menu

Gollapudi columns ~ Cheemalu..Cheemalu..(చీమలు..చీమలు.. )

Topic: Cheemalu..Cheemalu..(చీమలు..చీమలు..)

Language: Telugu (తెలుగు)

Published on: Dec 13, 2010

Source Credit: koumudi.net

Audio: Cheemalu..Cheemalu..(చీమలు..చీమలు..)     

దాదాపు రెండు వందల సంవత్సరాల కిందట త్యాగరాజస్వామికి టెడ్ విల్సన్ తారసపడి ఉంటే హరికాంభోజి రాగంలో ’రామ నన్ను బ్రోవరా’ కీర్తన రాసేవాడు కాదు. రాసినా మరో విధంగా రాసేవాడేమో. ’చీమ’ వంటి నిస్సహాయమైన. అతి చిన్నప్రాణిలో భగవంతుడిని చూసిన అమాయక ప్రాణి త్యాగరాజు. అయితే చీమ ఆయన అనుకున్నంత నిస్సహాయమైన్ ’అల్పజీవి’ కాదు. (యూ ట్యూబ్ లో చీమల కథలు చదవండి – కళ్ళు తిరిగిపోతాయి.)

సృష్టిలో చీమ అంత నిర్దుష్టమైన ప్రణాళికతో బతికే జీవి మరొకటి లేదు. సమిష్టి జీవనానికీ, సహజీవనానికీ ముందుచూపుకీ సంఘశక్తికీ, సంఘటిత కార్యదక్షతకీ మానవుడు ఊహించనయినా ఊహించలేనంత బలమైన ప్రాణి చీమ. టెడ్ విల్సన్ ఒక జీవితకాలం పరిశోధనలు జరిపి ఎన్నో వివరాలు తెలియచేశాడు. అంతేకాదు, ఈ కథ విన్నాక మన నైచ్యానికీ, స్వార్థపరత్వానికీ ఒంటిపిల్లి రాకాసితనానికీ సిగ్గుతో కుమిలి చావాలనిపిస్తుంది. కాని ఎవరూ చావరు. ఎంతే కాదు, చీమకి లేని ఒక గొప్పగుణం మనిశికిఉంది. సిగ్గు, లజ్జ లేకపోవడం. కనుక చీమని చూసి చావక -చంపుకు తినే ప్రత్యేకమైన మానవ ’చీమల’ ప్రతిభని చాటడమే ఈ కాలమ్ లక్ష్యం!

చీమ జీవిత లక్ష్యం కేవలం జీవించడం. అంతకన్న దానికేమీ తెలియదు. ఆ విషయంలో తనకీ పక్క చీమకీ తగాదా లేదు. లేకపోతే సఖ్యత ఉంది. కొన్ని లక్షల చీమలు ఏకమయి ఒకే లక్ష్యంతో అద్భుతమైన క్రమశిక్షణతో ఆహారాన్ని వెదుక్కుంటాయి.ఆ అన్వేషణలో నడిచే ప్రతీ అడుగులోనూ ఒక విచిత్రమైన రసాయనాన్ని చీమవొదులుతుంది. మరొక చీమకి అది మార్గదర్శకం. (టెలికామ్ లో డబ్బుందని రాజా చీమకి ఎలా తెలుసు? చందోలియాకి ఎలా తెలుసు? బెహురా కి ఎలా తెలుసు? నీరా రాడియాకి ఎలా తెలుసు? కరుణానిధికి ఎలా తెలుసు? ఇదే విచిత్రమైన రసాయనం. దానిపేరు డబ్బు) చీమలు బతికే కాలనీలో కొన్ని లక్షల చీమలు జీవిస్తాయి. అధికజనాభా మన సమస్య. అధిక జనాభా శాంతియుత జీవనానికి సామూహిక సాధనకి వాటి ఆయుధం. ఆ కాలనీలోకి ఆక్సిజన్ని తీసుకుని బొగ్గుపులుసు వాయువుని వొదులుతాయి. అదొక విచిత్రమయిన ఎయిర్ కండిషన్ ఏర్పాటు. పుట్టలో మట్టిని కనీసం అరమైలు మోసి బయటికి చేరుస్తాయి. అన్నీ కలిసి కనీసం పది టన్నుల మట్టిని బయటికి తోస్తాయి. ( చీమలు పెట్టిన పుట్టలు పాములకెవైన యట్లు అని విన్నాం కదా) వీటి సంఘటిత శక్తి ఎంతటిదంటే కొంతవ్యవధిలో చైనా గ్రేట్ వాల్ తయారీకి సరిపోయే మట్టిని తరలించగలవట, వాటి రవాణా పద్ధతి అమోఘం, అద్భుతం.

ఆశ్చర్యంగా ఉందా? భారతదేశ చరిత్రలో కనీ వినీ ఎరుగనంతగా లక్షా డెబ్బై ఆరువేల కోట్లని తరలించిన చీమల్ని తమరుచూడలేదా? చీమల్ని సిగ్గుపడేట్లు చేసే ఐకమత్యాన్ని మానవ ’చీమలు’ చూపడం లేదా? ఇలా ఆలోచిస్తే మనం త్యాగరాజ స్వామిని సుళువుగా క్షమించగలం.

బెల్లం ఉన్నచోటే చీమలు చేరతాయి అన్న సామెతని గుర్తుచేశారు అలనాటి ఐయ్యేయెస్ ఆఫీసర్ టి.ఆర్.యస్.సుబ్రహ్మణ్యం గారు మొన్న ఒక టీవీ చర్చలో. బెల్లాన్ని తినడానికీ రకరకాల చీమలు పోగవుతాయి. అలాగే ’బెల్లం’ ఉన్న చోటుకి రకరకాల నాయకుల్ని, ఉద్యోగుల్ని బ్యురోక్రాట్స్నీ కార్పొరేట్ సంస్థలు చేరుస్తాయట. ఎందుకు? తిన మరగడానికి. తినే మంత్రిని పదే పదే ’తినగల’ మంత్రిత్వ శాఖల్లో ఉంచడానికి తినిపించే పద్ధతుల్లాయట. మనకి కళ్ళు తిరిగిపోయే నిజం ఏమిటంటే – బయటపడింది కనుక మనం ముక్కుమీద వేలు వేసుకుంటున్నాం కానీ, సంసారపక్షంగా ఈ ’తినుడు’ గత ముప్పై నలభై సంవత్సరాలుగా , రకరకాల బెల్లం తినుగోలు గరుగుతోందట.!

నాటక సాహిత్యంలో అద్భుతమైన నాటకం, నా మట్టుకు బెకెట్. ఒక అద్భుతమైన కథ. వ్యభిచారి, భోగలాలసుడు, అహంకారి, వ్యసనపరుడు రాజు. పాలనజరిపే యంత్రాంగం, డబ్బు చేతిలో ఉన్న వ్యవస్థ చర్చి. దాని అధినేత ఆర్చిబిషప్. తిరకాసు ఏమిటంటే రాజే చర్చి పెద్దని నియమించాలి. చర్చిపెద్ద చచ్చిపొయాడు. ఇప్పుడు రాజు కొత్త ’పెద్ద’ని నియమించాలి. ఎవరిని? దేవుడిని ఆరాధించే భక్తుడినా ? నాన్సెన్స్..తనకి అమ్మాయిల్ని తార్చే తనని ప్రేమించే అమ్మాయిని కూడా రాజు పక్కలో పడికోబెట్టే తార్పుడుగాడిని చర్చి పెద్దని చేశాడు, గల్లా పెట్టె కొంగుబంగారం అవుతుందని.. కాని ఆ తార్పుడు గాడు దైవ సన్నిధిలో నిజమైన వారసుడయ్యాడు. దేవుడి ప్రాతినిధ్యాన్ని నెత్తిన వేసుకున్నాడు. సంఘర్షణ..అద్భుతం!

ఇప్పుడు ఆ తిరకాసు లేదు. గొర్రెల మంద , ఓటరు, నాయకుల్ని ఎన్నుకున్నాడు. ఇందులో చాలామంది ’బెకెట్లు ’ ఉన్నారు. బెల్లం ఉంది. చీమల నాయకుల్ని కార్పొరేట్లు అక్కడ వాలేట్టు చేస్తారు. అందుకు కోట్లు చేతులు మారతాయి. రకరకాల చీమలు వెంట నడుస్తాయి. బెల్లాన్ని దోచుకోగలిగే చీమల్ని ఆయా స్థానాల్లోకి చేరుస్తారు. వాళ్ళందరూ ’బెకెట్’ లాగ సత్యసంధులైతే దిక్కుమాలిన నాటకం మిగులుతుంది. కాని అందరూ కల్సి కట్టుగా చీమలదండు అయితే టెలికాం స్కాం మిగులుతుంది.

ఏతా వాతా చీమని నిస్సహాయమైన ’ప్రాణి’గా చూసిన అలనాటి త్యాగరాజు వెర్రిబాగులవాడూ, పరమ అమాయకుడూ అని మనం జాలిపడాలి. అతనికి ఒక టెడ్ విల్సన్, ఒక రాజా, ఒక చందోలియా, ఒక బెహురా, ఒక పి.జె.థామస్, ఒక సురేష్ కల్మాడీ, ఒక రామలింగస్వామీ తారసపడలేదని మనం అనుకోవాలి.

తాజాకలం: చీమకీ, త్యాగరాజస్వామికీ క్షమాపణలతో..!

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.