Main Menu

Gollapudi columns ~ Ekkadiki pothondhi Ee Vyavastha ? (ఎక్కడికి పోతోంది ఈ వ్యవస్థ?)

Topic: Ekkadiki pothondhi Ee Vyavastha ? (ఎక్కడికి పోతోంది ఈ వ్యవస్థ? )

Language: Telugu (తెలుగు)

Published on: Nov 26, 2012

Ekkadiki pothondhi Ee Vyavastha ?(ఎక్కడికి పోతోంది ఈ వ్యవస్థ?)     

1948 నాటికి నాకు సరిగ్గా తొమ్మిదేళ్ళు. మహాత్మాగాంధీ హత్య జరిగింది. అదెంత నష్టమో, జాతి ఎంతగా కృంగిపోయిందో అర్ధం చేసుకునే వయస్సు కాదు. కానీ ఆనాడు విశాఖపట్నమంతా – ముస్లింలు, హిందువులు, పెద్దా చిన్నా – అంతా సముద్రతీరానికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ సముద్ర స్నానం చెయ్యడం నాకు గుర్తుంది. నా చేత కూడా మా అమ్మా నాన్నా స్నానం చేయించారు. ఓ మహాత్ముడి నిర్యాణానికి దేశ ప్రజలు సమర్పించిన నివాళి అది. అది హత్య. మరణం కాదు.

మరో 39 సంవత్సరాల తర్వాత ప్రముఖ సినీనటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్ర అనారోగ్యంతో మరణించారు. ప్రజలు చెలరేగిపోయి దుకాణాలు ధ్వంసం చేసారు. బస్సుల్ని తగలెట్టారు. మందు షాపుల్ని దోచుకున్నారు. 23 మంది చచ్చిపోయారు. 47 మంది పోలీసులు గాయపడ్డారు.. కనీసం ఒక్కడు దోచుకున్న మందు షాపుల్లో మందుని తప్పతాగి రోడ్డుమీద పడి చచ్చాడు.

దుఃఖం నుంచి విముక్తికి రెండు మార్గాలు. కృంగిపోవడం. మానవప్రయత్నాకి లొంగని ఆవేశానికి గుండె బాదుకోవడం. తన పరిసరాల్లో విధ్వంసం సృష్టించడం ఆ వ్యవస్థ సంస్కారానికి సంబంధించిన విషయం. అతి ప్రాధమికమయిన మానవ చేతన – నిస్సహాయంగా తన ఉదాసీనతకి దారులు వెదుక్కోవడం కుసంస్కారం. అంతకన్నా మరో వివరణ అందదు.

ఓ గొప్ప నాయకుడు – తన జీవితకాలంలో తనవయిన విశ్వాసాలకు తన చుట్టూ ఉన్న సమాజాన్ని చైతన్యవంతం చేయగలిగిన నాయకుడు – బాలా సాహెబ్ ధాకరే కన్నుమూశారు. సమాజంలో అన్యాయాన్నీ, అవినీతినీ వెక్కిరించి, హేళన చేసే కళకి దక్షత గల ప్రతినిధిగా – కార్టూనిస్టు గా జీవనాన్ని ప్రారంభించి – ఆ ‘వెక్కిరింత’ని హక్కూ, శాసనం చెయ్యాలన్న విధానాలను అమలు జరిపి, అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. విచిత్రంగా దేశం స్పందించింది. ఆయన అనుయాయులు, అభిమానులు, సానుభూతిపరులు – 2 లక్షల మంది శోక సముద్రంగా ఆయన భౌతిక కాయం వెనుక నడి చారు – శాంతియుతంగా. ఇది అనూహ్యమైన స్పందన.

ఇదేమిటి? అవినీతి పట్ల అతి చిన్న కారణానికి అసహనాన్ని చూపే పార్టీ – ఇంతగా శోక సముద్రంలో మునిగిపోయినందుకు చాలామంది విస్తుపోయారు. కానీ అందరూ హర్షించారు.

ఆ రోజు ముంబైలో జనజీవనం స్థంభించిపోయింది. హోటళ్ళు మూతపడ్డాయి. చేతిని నోటిని ఆసరా చేసుకు బ్రతికేవారు విలవిలలాడారు. అయితే 21 సంవత్సరాల అమ్మాయి షబీనా ధారా బాలధాకరే కారణంగా జనజీవనం స్థంభించడాన్ని నిరసిస్తూ ఫేస్ బుక్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఆ అభిప్రాయాన్ని రేనూ శ్రీనివాసన్ అనే మరో అమ్మాయి సమర్ధించింది. ఆవిడ మాటలివి: “గౌరవాన్ని సంపాదించుకోవాలి. ఎవరూ ఇవ్వరు. బలవంతంగా పొందలేరు. ఇవాళ కేవలం గౌరవం వల్ల ఖాక భయంవల్ల ముంబై స్థంభించిపోయింది. బాలధాకరే వంటి నాయకులు ప్రతీరోజూ పుడతారు. వెళ్ళిపోతారు. ఆ కారణంగా నగరాన్ని స్థంభింపజేయడం అన్యాయం. ఒక్కసారి ఆనాటి స్వాతంత్ర్యోద్యమ కాలంనాటి మహనీయుల్ని గుర్తుచేసుకోవాలి.”

అంతే. అంతవరకూ బిగపట్టుకున్న శివసేన ఆవేశం కట్టలు తెంచుకుంది. అసలు రంగు బయటపడింది. ఇప్పుడేం చెయ్యాలి? ఆమె మామయ్య అబ్దుల్ గఫార్ దాదా క్లినిక్ ని ధ్వంసం చేశారు. పేషెంట్లనూ, వారి బంధువుల్నీ తరిమికొట్టి శివసేన కార్యకర్తలు ఆసుపత్రిని సర్వనాశనం చేశారు.

అసలు కథ ఇదికాదు. పోలీసులకి శివసేన శక్తిసామర్ధ్యాలు తెలుసు. వారి కోపానికీ, ఆవేశానికీ ఎవరయినా బలికాక తప్పదని తెలుసు. అందుకని వారేం చేశారు? ఫేస్ బుక్ లో ఇంట్లో కూర్చుని తమ అభిప్రాయం చెప్పిన ఇద్దరు అమ్మాయిల్నిమతపరమైన అవ్యవస్థని సృష్టిస్తున్నారని అరెస్టు చేశారు.

ఈ దేశంలో పాలక వ్యవస్థ దుస్థితికి ఇంతకన్నా మరో ఉదాహరణ ఉండదు. ఇది నిరంకుశపాలనికి నిదర్శనం. వ్యక్తి స్వాతంత్ర్యం ఏ మంటలో కలిసిపోయింది – అని వాపోయారు కమ్యూనిస్టు పార్టీ నాయకులు డి.రాజా. పార్టీల బెల్లింపులకూ, బెదిరింపులకూ – నీతి పునాదులు సరిగ్గా లేని, మెజారిటీలను నమ్ముకుని ఆయుష్షును నిలుపుకునే నేటి రాజకీయ పార్టీల నిర్వాకం ఇది.

ఒకే ఒక్క స్పందన – ఈ దేశపు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు మార్కండేయ కట్జూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ కి ఉత్తరం రాశారు. దాని సారాంశం ఇది:

ఇద్దరమ్మాయిల వ్యక్తిగత అభిప్రాయాలు ఈ దేశంలో మత విశ్వాసాలను కించపరిచేవిగా ఉన్నాయన్న కారణానికి అరెస్ట్ చేశారు. మనది ప్రజాస్వామ్యం. ఫాసిస్టు నిరంకుశపాలన కాదు. మీరు వెంటనే ఈ అరెస్టుకి కారణమయిన అధికారుల మీద చర్య తీసుకోవాలి. అలా చెయ్యకపోతే రాజ్యాంగ నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని పాలించలేని మీ అసమర్ధత వెల్లడవుతుంది. ఇందు మూలంగా జరిగే పర్యవసానాలు మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది.

ఒక మహాత్ముడి మరణానికి జాతి ఉదాత్తంగా నివాళులర్పించే దశనుంచి – ఒక నాయకుడి మరణాన్ని తమ దౌష్ట్యానికి వాడుకుంటున్న శక్తులకు కొమ్ము కాసే దశకి ప్రభుత్వం దిగజారడం భయంకరమైన పతనం. ఒక ప్రభుత్వ నేతని ఈ విషయంలో ఒకప్పటి ఈ దేశపు ప్రధాన నాయమూర్తి నిలదీసే స్థాయికి రావడం దురదృష్టం. ఒక వ్యవస్థ నైతిక పతనానికి ఇది దయనీయమయిన పరిస్థితి.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.