Main Menu

Gollapudi columns ~ Kadupu Chinchikonte..(కడుపు చించుకుంటే..)

Topic: Kadupu Chinchikonte..(కడుపు చించుకుంటే..)

Language: Telugu (తెలుగు)

Published on: Nov 14, 2011

Kadupu Chinchikonte..(కడుపు చించుకుంటే..)     

చాలా సంవత్సరాల కిందట నేనో ఆస్తిని కొన్నాను. రిజిస్ట్రేషన్‌ చార్జీలు కట్టింది పోగా మరో 30 లక్షలు చెల్లించాల్సి ఉంది. రూలు ప్రకారం అది అనవసరం. అన్యాయం. కనుక కోర్టుకి వెళ్లి ఆ మొత్తాన్ని తగ్గించే ప్రయత్నం చెయ్యవచ్చన్నారు లాయరు. ఇందువల్ల మరో లాభం. కేసు తేలేవరకూ డబ్బు చెల్లించనక్కరలేదు. ఈ వ్యవధిలో వడ్డీ పడదు. కోర్టులో కేసు వేశాను. 30 లక్షల బాకీ వుంచుతూ -ఒక ఆరు నెలలు చెల్లించడానికి గడువునిచ్చి ఆస్తిని రిజిస్టర్‌ చేశారు.

ఇది సివిల్‌ కేసు. మరో నెల తర్వాత ఒకాయన నా దగ్గరికి వచ్చాడు. ఈయన ఇలాంటి కేసుల్లో పండి ముదిరిన మధ్యవర్తి. గవర్నమెంటు ఉద్యోగే. ఈయన చిరునవ్వు నవ్వుతూ -ఈ సమస్యకి మూడు పరిష్కారాలు ఉన్నాయన్నాడు. 1. కేసు జరిగినంతకాలం జరగనిచ్చి -కోర్టు నిర్ణయం ప్రకారం మొత్తాన్ని చెల్లించడం. అది ఎవరైనా చేసే, చెయ్యాల్సిన పని.

2. ఈ కేసు నాలుగేళ్లు సాగాలా? అయిదేళ్లు సాగాలా? (ఈలోగా 30 లక్షలు కట్టే భారం ఉండదు కనుక) 3. అసలు శాశ్వతంగా ఈ సమస్యకి పరిష్కారం కావాలా? అంటే ఇక ఎప్పుడూ డబ్బు చెల్లించనక్కరలేదు. నేను ఆశ్చర్యపోయాను. అదెలాసాధ్యం? ఉద్యోగి సర్వాంతర్యామిలాగ నవ్వాడు. అయ్యా, తమరు సెలవిస్తే ఆ ఫైలు ఆఫీసులోంచి పూర్తిగా మాయమయే ఏర్పాట్లు చేస్తాం. గుమాస్తాలకు చూసిందే గుర్తు. మేం గుర్తు లేకుండా చేస్తాం. దానికి ‘ఖర్చు’ అవుతుంది. నేను నిశ్చేష్టితుడినయాను.

మనకి చట్టాలున్నాయి. నిబంధనలున్నాయి. కాని వాటిని బుట్టదాఖలు చేసే కిటుకులూ ఉన్నాయి. డబ్బు ఖర్చు చేస్తే చట్టాల్ని తుంగలో తొక్కే మేధావులూ ప్రభుత్వంలోనే ఉన్నారు. సమాచార చట్టం ఉంది. దాని ప్రకారం ప్రభుత్వ విభాగాలలో ఏం జరుగుతుందో పూసగుచ్చినట్టు పౌరుడు తెలుసుకొనే అవకాశం ఉంది. కాని ఆ విభాగంలో ఫైలే గల్లంతయితే!

ఇప్పుడు రెండు గొప్ప ఉదాహరణలు. ఢిల్లీలో 6 కృష్ణమీనన్‌ మార్గ్‌ బంగళా ఒకప్పుడు జగ్జీవన్‌రామ్‌ నివాసం. ఆయన పోయాక ఆ బంగళాను వారమ్మాయి మీరా కుమార్‌కు కేటాయించారు. ఆమె అందులో ఉండనంది. అప్పుడు దాన్ని స్మారక మందిరమన్నారు. అయితే 2000 లో ఇలా బంగళాలను స్మారక మందిరాలుగా మార్చకూడదని మంత్రిమండలి తీర్మానించింది. అయినా ఇన్నేళ్లూ ఇది ఖాళీగానే ఉంది. ఎందుకని? ఇది అన్యాయమంటూ సుభాష్‌ చంద్ర అగర్వాల్‌ అనే ఆయన సమాచార చట్టం కింద వివరాలను ఇవ్వమన్నారు. అయితే ఆ బంగళాకు సంబంధించిన ఫైలు డిపార్టుమెంటులోంచి గల్లంతయింది!

మరోముచ్చట. దయానిధి మారన్‌ అనే టెలికాం మంత్రిగారు పదవిలోకి వచ్చాక 322 టెలిఫోన్‌ లైన్లతో ఇంట్లోనే ఒక టెలిఫోన్‌ ఎక్స్చేంజీని స్థాపించుకున్నారు. ఈ కథ ఈ మధ్యనే వీధినపడి సిబిఐ దర్యాప్తు ప్రారంభమయింది. ఈ నిర్వాకం అలనాడు బిఎస్‌ఎన్‌ఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా ఉన్న ఎమ్‌.పి.వేలుస్వామిగారి హయాంలో జరిగింది.
ప్రస్తుతం వేలుస్వామిగారు రిటైరయి సేలంలో ఉంటున్నారు. ఎప్పుడైతే దర్యాప్తు ప్రారంభమయిందో వేలుస్వామిగారు చెన్నై చేరుకున్నారు. వరస తప్పకుండా ఆఫీసుకి వెళ్తున్నారు. ఎందుకు? అధికారిగా ఉంటే ఫైలుని గల్లంతు చెయ్యడం తేలిక. ఇప్పుడు జాగ్రత్తగా కాగితం కాగితం బయటికి లాగి మాయం చేస్తున్నారు. ఇది సిబ్బంది కనిపెట్టారు. రేపు విచారణ జరిగితే సిబ్బంది ఈ కుంభకోణంలో ఇరుక్కుంటారు. తీరా ఈ ఘనకార్యం చేసేది ఇకప్పటి పెద్ద ఉద్యోగి. ఎలా? ఈ వ్యవహారం జాతీయ టెలికాం ఉద్యోగుల ఫెడరేషన్‌ చెవిలో వేశారు. ఈ మధ్య 200 మంది ఉద్యోగులు పరశువాక్కంలోని అధికారి ఆఫీసుముందు ఘెరావ్‌ చేశారు. వారి ఫిర్యాదు: రిటైరైన వేలుస్వామిగారు రోజూ ఆఫీసుకి వస్తున్నారు. రిటైరైయాక వారికేంపని? ప్రతిరోజూ చీఫ్‌ జనరల్‌ మేనేజరు కార్యాలయంలో కీలక ఫైళ్లని తిరగేస్తున్నారు. కొన్ని కీలక కాగితాలు మాయమౌతున్నాయి. ఇదీ వారి ఆరోపణ.

”నా అవసరాలకు వెళ్తున్నాను. రావద్దంటే మానేస్తాను” ఇదీ ఘనత వహించిన వేలుస్వామి స్పందన కీల్పాక్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ముత్తుకుమార్‌ కేసు నమోదు చేశారు.

అయ్యా, కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది.
సమాచార చట్టాన్ని గంగలో కలిపే ప్రయత్నాలు ఈ మధ్య కేంద్రం ముమ్మరంగా చేస్తోంది. ఆ ప్రయత్నాన్ని చేపట్టి పూర్తిగా ఉద్యోగులు సాధించారని ఈపాటికే వారికి తెలిసి ఉండాలి.

ఒకవేళ ఎవరైనా అమాయకంగా నిజాలు తవ్వబోతే వాళ్లప్రాణాలు తీసేప్రయత్నాలూ విజయవంతంగా సాగిపోతున్నాయి. మనకి బోలెడంతమంది వేలుస్వాములున్నారు. దయానిధులున్నారు.

ప్రస్తుతం సమాచార హక్కు కాగితం మీదే ఉంది. క్రమంగా ఆ కాగితాలు గల్లంతవుతున్నాయి..

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.