Topic: Kasi mamayyalu! (కాశీ మామయ్యలు! )
Language: Telugu (తెలుగు)
Published on: Apr 21, 2014
Kasi mamayyalu!(కాశీ మామయ్యలు! )

ఇటీవల ఒక దినపత్రికలో ఒక ప్రకటనని చూశాను -‘కనబడుటలేదు’ అంటూ. ఏలూరు వోటర్లు నగరంలో గోడల మీద ఈ ప్రకటనని అంటించారట. ”మా ఏలూరు లోక్‌సభ ప్రతినిధిగా మేము ఎన్నుకున్న ఎం.పి., కేంద్ర మంత్రి… గత కొన్ని రోజులుగా కనిపించుటలేదు. వారి ఆచూకీ తెలిపిన -వారికి తగిన బుద్ధి చెప్పబడును” -ఇదీ ప్రకటన.
చక్కని హాస్యం, ఎక్కువ కడుపుమంట ఉన్న మహానుభావులు ఇలా వీధిన పడ్డారు. ఎలాగూ -ఈ నాయకుల పుణ్యమా అని తమకు దరిద్రం తప్పలేదు కనుక -ఈ ఖర్చుకూడా దానిలో భాగమేననుకొని ఈ ప్రకటనతో గోడలెక్కారు.
అయితే ఈ ప్రకటన ఇచ్చినవాళ్లతోనే నా తగాదా. పాపం, మీరు మీ నియోజకవర్గం నాయకుల గురించే వాపోయారు. ఓ వోటరుకి ఏ నాయకుడు ఏ నియోజకవర్గంలో కనిపించి చచ్చాడు? ఈ పోస్టర్లని తమరు దేశమంతా పంచాలని, అన్ని నగరాలలో అన్ని గోడలూ అలంకరించవలసిన యోగ్యత ఈ పోస్టర్లకి ఉన్నదని నా మనవి. నేను కొన్ని సంవత్సరాలుగా విశాఖపట్నంలో ఉంటున్నాను. రోడ్డుమీద పోయే ఏ పదిమందినో ఆపి -ఈ రెండు ప్రశ్నల్నీ అడగండి. 1. బాబూ! ఈ నియోజకవర్గంలో మీ నాయకుడెవరు? 2. ఆయన్ని మీరెప్పుడయినా చూశారా? (కలుసుకోవడం కాదు). ఒక్కరు -ఒక్కరు -సరైన సమాధానం చెప్తే నేను నా చెవి కదపాయిస్తాను -గిరీశం మాటల్లో.
ఈ నలభై రోజులే నాయకులు మనకు దర్శనమిస్తారు ‘సామాజిక సేవ, ప్రజలకు న్యాయం’ అనే బూతుమాటలు మాట్లాడుతారు. మీ అరిచేతుల్లో వైకుంఠాన్ని పెడతారు. తర్వాత టీవీల్లో, విమానాల్లో -యింకా వారి సామర్థ్యం ముదిరితే కోర్టుల్లో, తీహర్ జైళ్లలో దర్శనమిస్తారు. పొరపాటున ఎప్పుడయినా తటస్థపడితే ”ఎవరయ్యా నువ్వు? నీ పేరేమిటి? అప్పుడే నీకు 500, విస్కీ పాకెట్టు ముట్టింది కదా” అని విసుక్కొంటారు. ఇంకా నిలదీస్తే ‘నీ దిక్కున్నవాడితో చెప్పుకో’ అని తప్పుకుంటారు.
సోనియాగాంధీగారు ఆంధ్రదేశానికి వచ్చి ఎన్నాళ్లయింది? తెలంగాణా వచ్చి ”నేనే మీకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చాను. నాకు రెండు రాష్ట్రాల మీదా ప్రేమ ఉంది’ అని వక్కాణించారు. మరి ఆంధ్రాకి రాలేదేం? ఆంధ్రా సభలో వారలా బోర విరుచుకుని చెప్పే అదృష్టం మనకి లేదా? ముఖం చెల్లని పని చేసిన guilt మన సోనియాగాంధీగారి రోగం. ఆమె తెలంగాణా సభ వల్ల జరిగిన మేలు కంటే ఆంధ్రా సభలో పాల్గొనలేని నిస్సహాయత కొట్టవచ్చినట్టు కనబడి ఆ పార్టీని చీల్చి చెండాడుతుంది. ఏమయినా ఆ పార్టీ రూపురేఖలు ఉన్నప్పటి మాటకదా!
రాష్ట్రాన్ని చీల్చిన ఆ ఘనులు ఏరీ? పి.చిదంబరంగారు రాజకీయ సన్యాసం తీసుకున్నారేం? దిగ్విజయ్‌సింగ్ కొడుకు నిలబడడానికి ముఖం చెల్లలేదేం? వందలాది ప్రముఖ కాంగ్రెస్ నాయకులు ఆమె త్యాగానికి తలబొప్పికట్టి పార్టీని వదిలిపోతున్నారేం? 500 రూపాయలు, బ్రాందీ పేకట్టుతో వోట్లని కొల్లగొట్టే వ్యాపారుల రోజులు పోయాయి. చిన్నపామునయినా పెద్ద కర్రతోకొట్టే అరుదైన విజ్ఞానాన్ని సమకూర్చుకున్న వోటరు నిలదొక్కుకునే రోజులు. అందుకు ఈ ఏలూరు ప్రకటనే తార్కాణం.
ఇంతకూ కాశీ మామయ్య కథ చెప్పలేదు. ఆ మధ్య ప్రముఖ హిందీనటుడు అమీర్‌ఖాన్ ”సత్యమేవ జయతే” కార్యక్రమంలో ఓ చక్కని ఉదాహరణ చెప్పారు. ఒక యాత్రికుడు వారణాశి రైలు స్టేషన్లో రైలు దిగాడట. ”ఏరా చిన్నా, బాగున్నావా?’ అంటూ ఓ ముసలాయన వాటేసుకున్నాడు. ఇతను చిన్నా అని ఆయనకేం తెలుసు? రైలు కంపార్టుమెంటు మీద రిజర్వేషన్ చార్టు ఉంటుంది కదా? ఇంతకీ చిన్న ఆశ్చర్యపోయాడు. ‘మీరెవరు?’ అన్నాడు బలహీనంగా. ”నేనురా బుచ్చిమామయ్యను. నీకు గుర్తుండదులే. నీ చిన్నతనంలోనే కాశీకి వచ్చేసి ఉండిపోయాను. అమ్మ బాగుందా?’ అన్నాడు.
”పోయింది. ఆవిడ కోసమే…”
”ఇంక చెప్పకు. మా దొడ్డ ఇల్లాలు. నేను దగ్గరుండి నా చెల్లి రుణం తీర్చుకుంటాను. ముందు గంగలో మునిగి కాశీవిశ్వేశ్వరుడి దర్శనం చేసుకుందువుగాని పద” అని సంచీ అందుకున్నాడు. తెలియని క్షేత్రంలో తెలిసిన మనిషి కనిపించినందుకు చిన్న ఆనందించాడు. దశాశ్వమేధ ఘాట్ దగ్గర బట్టలు విప్పి, వస్తువులన్నీ సంచీలో పెట్టి ఈ బుచ్చి మామయ్యని చూస్తూ గంగ లో దిగాడు. ఒక్కసారి మునిగిలేచాడు. అంతే. కాశీ మామయ్య లేడు. తన బట్టలు, డబ్బు, వస్తువులు మాయమయాయి. ఎవరీ మామ య్య? ఎక్కడ ఉంటాడు?
ఏలూరి వోటర్‌దీ ఇదే పరిస్థితి. అయిదేళ్ల కొకసారి మనల్ని గంగలో దించి, మొలలోతు నీళ్లలో గావంచాతో వదిలేసి, మన సర్వస్వాన్నీ దోచుకుపోయే కాశీ మామయ్యల కాలమిది. ఇది నా కథ కాదు. అమీరు ఖాన్‌ది.
మరో కారణానికి నాకు ఏలూరు వోటర్లమీద జాలిగావుంది. ఈ నాయకులెవరో కనిపిస్తే ఏం చేస్తారు? వారికి బుద్ధి చెప్తారట. అయ్యా! వారికి లేనిదీ, అవసరం లేనిదీ, తమకి ఉన్నా ఉపయోగం లేనిదీ ఒకటుంది -దాని పేరు బుద్ధి. వారి కున్నది కౌశలం. బుద్ధి విచక్షణని నేర్పుతుంది. సంయమనాన్ని ఇస్తుంది. అక్కరలేనిదానిని దూరంగా ఉంచంటుంది. కౌశలం చేతనైనదాన్ని దక్కించుకునే ప్రావీణ్యం. దక్కించుకున్నదాన్ని నిలుపుకునే దగ్గరతోవకి స్ఫూర్తి. అయితే ఎప్పటికప్పుడు మోసపోయినా నిలదొక్కుకోడానికి వోటరుకి కలిసివచ్చేది -బుద్ధి. దాన్ని నష్టపోకండని మనవి చేస్తున్నాను.
ఇలాంటి పోస్టర్ల నకళ్లు ప్రతీ నియోజకవర్గం వారూ ప్రతీచోటా ప్రతీ గోడమీదా అలంకరించాలి. అందువల్ల నాయకులకి బుద్ధి వస్తుందని నేను అనుకోను. వెనకటికెవరో అడిగారట: ”తెలివితేటల వల్ల ఏమిటి ప్రయోజనం?” అని. ”ఎదుటి వ్యక్తిలో లేనిదేదో గుర్తు పట్టడానికి” అన్నాడట ఆ పెద్దమనిషి.
అయిదేళ్ల కొకసారి అవకాశం వచ్చినా బాలెట్ బాక్స్ త్రాచుపాము అనే స్పృహ -సంస్కారం వల్లగాక తమ స్వప్రయోజనాలు చెల్లుబాటుకాలేని ‘ఆటకట్టు’ కారణంగానయినా నాయకుల వెన్ను అదురుతుంది. వాళ్ల మనస్సుల్లో మార్పుకాకపోయినా, మార్పురానివారిని గద్దె దించే ‘మర్యాద’ వోటరుకి దక్కుతుంది. గోడకెక్కిన పోస్టర్లు నాయకుల నెత్తికెక్కిన అధికార దుర్వినియోగానికి విరుగుడు. వోటరు నిర్వీర్యతకు అభిజ్ఞ.
No comments yet.