Main Menu

Gollapudi columns ~ Maro Telugu Peethadhipati(మరో తెలుగు పీఠాధిపతి)

Topic: Maro Telugu Peethadhipati(మరో తెలుగు పీఠాధిపతి)

Language: Telugu (తెలుగు)

Published on: Apr 22, 2013

Maro Telugu Peethadhipati(మరో తెలుగు పీఠాధిపతి)     

భారతీయ జ్ఞానపీఠ పురస్కారం మన దేశస్థాయిలో నోబెల్‌ బహుమతి లాంటిది. జాతీయస్థాయిలో అన్ని భారతీయ భాషలలోనూ ఉత్తమ రచయితగా నిలిచి జ్ఞానపీఠాన్ని అధిరోహించడం -తెలుగు దేశానికి, తెలుగు రచయితకి ఇది మూడవసారి. 1970లో కవిసామ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణకు ‘రామాయణ కల్పవృక్షం’ రచనకు బహుమతి లభించింది. 1988లో పద్మభూషణ్‌ సి.నారాయణ రెడ్డిగారికి ”విశ్వంభర” రచనకిగాను జ్ఞానపీఠ పురస్కారం దక్కింది. ఇప్పుడు రావూరి భరద్వాజకు -వారు రచించిన ”పాకుడురాళ్లు” నవలకి.

నిజానికి మొదటి సంవత్సరమే విశ్వనాధకు బహుమతిని ఇవ్వాలనుకున్నారని ఒక్క వోటులో దక్కలేదని చెప్పుకున్నారు. ”అది మంచికే జరిగింది. గుర్తింపు పొందాల్సిన కృషికి దక్కిందని తర్వాత విశ్వనాధ అన్నారట. బహుమతిని అం దుకున్నాక ఒక పాత్రికేయుడు ఆయన్ని అడిగారు: అయ్యా, ఇంత డబ్బుతో ఏం చేస్తారు? అని. ”డబ్బు నా జేబులోకి పోతుంది. కాని జేబు కి చాలా కన్నాలున్నాయి” అన్నారు విశ్వనాధ.

ముగ్గురూ మూడు తరాలకు, మూడు ధోరణులకు, మూడు దృక్పథాలకు ప్రతినిధులు. అనాదిగా వస్తున్న ఆర్ష సంప్రదాయ ‘ధర్మాన్ని’ ప్రతిపాదించే అపూర్వ రచన కల్పవృక్షం. ఆధునిక కవితాత్మకు అద్దం పట్టే రచన విశ్వంభర. ఇ క రావూరి భరద్వాజ అట్టడుగు జీవితాలకు అద్దంపట్టే ఉద్యమాన్ని తన రచనల్లో 70 సంవత్సరాలపాటు అనవరతంగా సాగించిన రచయిత. చదువుకున్నవాడు కాదు. తన పదమూడవయేట -ఏడో తరగతి చదువుతూండగా -కేవలం లేమి కారణంగా చిరిగిన బట్టలతో బడికి వె ళ్లిన అతన్ని ఉపాధ్యాయుడు పిలిచి -పదిమంది ముందూ చావగొట్టాడు. దైన్యత పడగవిప్పింది. బాధతో, నిస్సహాయతతో రెచ్చిపోయి -పుస్తకాలు అక్కడే పారేసి -క్లాసు రూంలోంచి పారిపోయాడు. ఆ తర్వాత బడికి వెళ్ళలేదు. కాని తన రచనలు కొన్నితరాల పిల్లలు క్లాసు రూ ముల్లో చదువుకొనే రచనలు -కేవలం పరిశ్రమతో, కృషితో సాధించుకున్నాడు. ఆ మధ్య హెచ్‌.ఎం.టి.వీ.కి చేస్తున్న ‘వందేళ్ల కథకు వందనాలు’ కార్యక్రమానికి ఇంటర్వ్యూ చేస్తూ ”మీ రచనా వ్యాసంగానికి స్పూర్తి ఏమిటి? అని అడిగాను. సమాధానం సూటిగా, నిర్ద్వందంగా గుండెలోతుల్లోంచి వచ్చింది. ”అవిద్య, అవసరం, ఆకలి” -అన్నారు. ఇది ఒక జీవితకాలం రచయితని వెన్నాడిన జీవుని వేదన. 86వ యేట కూడా దాన్ని మరిచిపోలేదు.

బహుమతి వార్త వింటూనే అలనాడు ఆయనతో ఆకలిని పంచుకున్న మిత్రుడిని -ఆలూరి భుజంగరావుని -పలకరించాను. ఆయనిప్పుడు గుంటూరులో ఉంటున్నారు. దాదాపు డెబ్బై ఏళ్ల కిందట -భరద్వాజ, ఆలూరి భజంగరావు (ఆయన వయస్సు ఇప్పుడు 85), మరో గొప్ప రచయిత నటరాజన్‌ (కలం పేరు ‘శారద’) మిత్రులు. ఆకలినీ, అవసరాన్నీ, అవిద్యనీ పంచుకుంటూ తెనాలిలో జీవించారు. భుజంగరావు భరద్వాజకు వండిపెట్టేవాడట. నటరాజన్‌ తమిళుడు. కేవలం కూటికోసం పొట్ట పట్టుకుని మద్రాసు నుంచి తెనాలిలో దిగాడు. రోజుకి 18 గంటలు హోటల్‌ కార్మికుడిగా పనిచేస్తూ రచనలు చేశాడు. ఆ రోజుల్లో తెనాలి పత్రికా ప్రచురణకు కూడలి. భరద్వాజ వ్యవసాయ కూలీగా పనిచేశాడు, నలంద ప్రెస్‌లో ప్రూఫ్‌ రీడర్‌గా పనిచేశాడు. ఆనాటి పత్రికలు యువ, జ్యోతి, రేరా ణి, అభిసారిక వంటి పత్రికలకు రాశాడు. సెక్సు కథలు రాశాడు. ఉపాధి లక్ష్యం. ఆకలిని తరిమికొట్టడం ఆదర్శం.

అప్పటికే ఇజాలకు, సిద్ధాంతాలకు ముడిపడలేదు. నవలలు, కథలు, వ్యాసా లు, బాల సాహిత్యం, నాటికలు -ఒకటేమిటి? అన్నిటిలోనూ తనదయిన ప్రతిభనీ, ఉపజ్ఞనీ చాటాడు. 185 పుస్తకాలు ప్రచురితమయాయి. కొన్నాళ్లు ‘జమీన్‌ రైతు’లో పనిచేశాడు. కొన్నాళ్లు ‘దీనబంధు’ అనే పత్రికను నడిపారు. 1959లో అసలైన ఉద్యోగం దొరికింది.

ఆలిండియా రేడియోలో గ్రామస్థుల కార్యక్రమంలో స్క్రిప్టు రచయితగా చేరాడు. ఆ రోజుల్లోనే 1963 నుంచి 8 సంవత్సరాల పాటు మేమిద్దరం కలిసి పనిచేశాం. ఏ విషయం మీదయినా అలవోకగా రాసే పనివాడితనాన్నీ, పసనీ సాధించారు. ఇద్దరం సభల్లో కలిసేవాళ్లం. రేడియో మా కూడలి. 1968లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. 1983లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. నాగార్జున, ఆంధ్రా, జవహర్‌లాల్‌ సాంకేతిక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేటులతో ఆయన్ని సత్కరించాయి. ఇక పురస్కారాలు వెల్లువెత్తాయి. యువ సాహితీ, సోవియట్‌ భూమి నెహ్రూ పురస్కారం, రాజలక్ష్మీ పురస్కారం, లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ పురస్కారం మొదలైనవెన్నో అందుకున్నారు. తన నలభైయ్యవ యేటనే ప్రస్థుత భారతీయ జ్ఞానపీఠ్‌ పురస్కారానికి కారణమైన ‘పాకుడు రాళ్లు’ నవలను రాశారు. ఈ నవల ఒక చరిత్ర. సినీరంగంలో మెరుపుల జీవితాల వెనుక బయట ప్రపంచానికి తెలియని సుడిగుండాలను ఎత్తిచూపే రచన పాకుడురాళ్లు. అలాంటి ఇతివృత్తాలు ఆంగ్లభాషలో చాలానే వచ్చాయి. సిడ్నీ షెల్డన్‌ ‘ది అదర్‌ సైడ్‌ ఆఫ్‌ మిడ్నైట్‌’ ఇటువంటి రచన. అయితే ఈ అర్ధ శతాబ్దిలో ఇలాంటి ఇతివృత్తం, ఇంత విశ్లేషణాత్మక రచన రాలేదు. మొదట ఈ నవలకి ”మాయ జలతారు” అని పేరు పెట్టుకున్నారట. ఆయన మిత్రులు శీలావీర్రాజు ”పాకుడు రాళ్లు” పేరుని సూచించారు. తర్వాత కృష్ణాపత్రికలో మూడు సంవత్సరాల పాటు పాఠకలోకాన్ని ఊపి ఉర్రూతలూగించింది. ఇప్పుడది చరిత్ర.

అనితర సాధ్యమైన మరొక కృషి ఆయన వ్రాసిన స్మృతి కావ్యాలు. తన జీవన సహధర్మచారిణి కాలం చేసినప్పుడు -హృదయం చెదిరి, తన వేదనకి అక్షరరూపం ఇచ్చి -ఒకటికాదు -అయిదు పుస్తకాలు రాశారు. ‘నాలోని నీవు’, ‘అంతరంగిణి’, ‘ఐతరేయం’, ‘అయినా ఒక ఏకాంతం’, ‘ఒకింత వేకువకోసం’. ఇవి అపూర్వమైన స్మృతి రచనలు.

విచిత్రమేమంటే -అంతకుముందు -అలాంటి రచన చేసింది -మరో జ్ఞానపీఠ బహుమతి గ్రహీత విశ్వనాధ సత్యనారాయణ. తన శ్రీమతి వెళ్లిపోయాక ‘వరలక్ష్మీ త్రిశతి’ వ్రాశారు. 48 సంవత్సరాల సుదీర్ఘ జ్ఞానపీఠ చరిత్రలో రావూరి భరద్వాజ -ఒక సరికొత్త అధ్యాయానికి ప్రతీక. చదువుతో ప్రమేయం లేకుండా తన రచనలకు జీవితాన్నే పెట్టుబడిగా చేసుకుని అట్టడుగు వర్గాల దయనీయ జీవితాలకు అద్దంపట్టే సాహిత్యాన్ని జాతీయ స్థాయిలో నిలిపిన ఘనత రావూరి భరద్వాజకు దక్కుతుంది. సాహితీ చరిత్రలో ఒక గణనీయమైన మలుపుకీ, ప్రజాస్వామికమైన ధోరణికీ, నికార్సయి న జీవుని వేదనకీ -అభిజ్ఞగా నిలిచిన ఉద్యమకారుడు, కాళ్లు నేలమీద నిలుపుతూనే సృ జనను ఆకాశాన నిలిపిన గొప్ప స్ఫూర్తిదాయకుడు రావూరి భరద్వాజ..

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.