Main Menu

Gollapudi columns ~ ‘Maya’ Pradesh(‘మాయా ‘ ప్రదేశ్)

Topic: ‘Maya’ Pradesh(‘మాయా ‘ ప్రదేశ్)

Language: Telugu (తెలుగు)

Published on: Sep 12, 2011

Maya Pradesh(మాయా ప్రదేశ్)     

ప్రపంచంలోకల్లా ఆసక్తికరమైన విషయాలు మూడు ఉన్నాయి. పక్కవాడి రహస్యాన్ని కనిపెట్టడం, ఎదుటివాడి అవినీతిని బయటపెట్టడం, పొరుగువాడి రంకు గురించి కబుర్లు చెప్పుకోవడం. ఇంతకన్నా రుచికరమైన వ్యావృత్తి ప్రపంచంలో మరొకటి లేదు.

“నీకు తెలుసా – మన గోవిందుగాడు – వాళ్ళ వంటమనిషితో మొన్న –” ఆ రుచి అద్భుతం.

“మీకు తెలీదు బాబూ – ఫలానా మంత్రిగారు పదికోట్లు స్వాహా చేశారు..” ఆ ఆనందం తొడమీద దురద గోక్కోవడం అంత సుఖం.

“మీరు విన్నారా? మనవాడు ఫలానా స్వామి దగ్గరకి వెళ్ళడానికి కారణం పుణ్యమూ కాదు, పాపమూ కాదు – తను సంపాదించిన బంగారాన్ని దాచిపెట్టడానికి” – ఆ రహస్యాన్ని పంచుకోవడం స్వర్గం.

జూలియన్ అసాంజే వికీలీక్స్ లో అంత సుఖం ఉంది. మనకి తెలియని ఎన్నో ‘నీచపు’ విషయాల్ని తెలియచెప్పే తాటాకు పత్రాలవి.

ఇందులో బొత్తిగా తెలియన క్కర్లేని కథ – మాయావతి మేడంది. పాపం, ఆవిడకి కొత్త జోళ్ళు కావలసి వచ్చింది. వెంటనే జెట్ విమానం లక్నోనుంచి ముంబైకి బయలుదేరింది. ఫలానా జత జోళ్ళను తెచ్చింది. దాని ఖరీదు – ఏతావాతా పది లక్షలు.

ఇందులో ఎవరినయినా ఆ ఖరీదయిన చెప్పుచ్చుకు కొట్టాలంటే – ముందు ఓటర్ని. ఆమె దళితులకే అన్యాయం చేస్తోందని ఆ వికీలీక్స్ సమాచారం. ఇందుకు నేను సుతరామూ అంగీకరించను. ఆ మధ్య నేను అయోధ్య వెళుతూ ఒకరోజు లక్నోలో ఆగాను. స్వయంగా ఆమె దళితులు గర్వపడే పనులెన్నో చేయడం చూశాను.

మహాత్మా గాంధీ అనే ఓ గర్భ దరిద్రుడి స్మృతి చిహ్నం – రాజ్ఘాట్ – వీటి దిష్టికి కూడా పనికిరానంత వైభవంగా బాబా సాహెబ్ అంబేద్కర్, వారి సతీమణి రమాబాయ్ అంబేద్కర్, పాఠాలు చెప్పుకుంటూ ఏదో మూల ఉద్యోగం చేసుకుంటున్న ఓ దళిత యువతికి – కేవలం దళిత యువతి అయిన కారణంగానే పార్టీలో ప్రాముఖ్యాన్ని కల్పించి, రాష్ర్ట ఆధిపత్యానికి రాగల ఆస్కారాన్ని కల్పించిన మాయావతి మార్గదర్శకులు కాన్షీరాం పేరిట నిర్మించిన స్మృతి భవనాలు అనూహ్యం. ఒక్క ‘కాన్షీరాం ఇకో గార్డెన్’కి మాత్రమే కేవలం 450 కోట్లు ఖర్చయించట. ఇంకా అభివృద్దికి మరో 41 కోట్లు కావాలని ఆమె కేంద్రాన్ని అడుగుతున్నారు. మిగతా రెండు స్మృతి మందిరాలకీ కేవలం 500 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. కాన్షీరాం మెమోరియల్ లో తమరు మాయావతి మేడం విగ్రహాన్ని దర్శించవచ్చు.

ఈ పార్కులకీ, స్మృతి భవనాలకీ కోట్లకి కోట్లు ఖర్చయిపోతోందని కంట్రోలర్, ఆడిటర్ జనరల్ గగ్గోలు పెట్టినా పట్టించుకునే నాధుడు లేడు. మరి చెప్పులకోసం ప్రత్యేక విమానం కథ వారిదాకా వెళ్ళిందో లేదో మనకి తెలియదు.

నాయకులు పదవుల్లో ఉన్నప్పుడు, వారి పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు తమ తమ పెద్దలకు ఇలా నివాళులర్పించడం ఈ దేశంలో సబబు, సంప్రదాయం. ఈ అరాచకానికి కొలబద్దలేదు. వెదకడం వృధా. 1967 లో కనీవినీ ఎరగని రీతిలో అధికారంలోకి వచ్చిన ద్రవిడ మున్నేట్ర కజగం నాయకులు అన్నాదురై కొన్ని నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి అకాల మరణానికి 150 లక్షల మంది మాత్రమే తరలి వచ్చారు. ఆయన స్మృతి చిహ్నం చెన్నై బీచిలో ఉంది. అదే కోవలో మరొక నాయకులు, నటులు ఎం.జిఆర్ సమాధి పక్కనే ఉంది.

ఈ దేశంలో రాజకీయ పార్టీల పుణ్యమా అని బొంబాయి ముంబై అయింది. మద్రాసు చెన్నై అయింది. బరోడా వదోద్రా అయింది. వెస్ట్ బెంగాలు పశ్చిం బంగా కానుంది. ఒక్క చెన్నైలోనే మౌంట్ రోడ్ అన్నాశాలై అయింది. ఇంకా ఈవీ రామస్వామి నాయకర్ శాలై, పసుంపోన్ మత్తు రామలింగ తేవర్ శాలై వంటివెన్నో ఉన్నాయి. మరి ‘నాయకర్ ‘, ‘తేవర్ ‘ కులాల పేర్లు కదా? ఆ మధ్య ద్రవిడ నాయకులు కులాల పేర్లు ఉండరాదని రోడ్ల పేర్లమీద పడ్డారు. వారే గౌరవంగా పెట్టిన బి.ఎన్.రెడ్డి రోడ్డు బి.ఎన్.రోడ్డయి, బి.ఎన్.అంటే ఏమిటో ఎవరికీ అర్ధంకాక – ఇప్పుడు నరసిమ్హన్ రోడ్డు అయింది! ఇప్పటి ఈ నరసిమ్హనే మన బొమ్మిరెడ్డి నరసిమ్హారెడ్డి అనబడే బి.ఎన్ రెడ్డి అని ఎవరయినా అన్వయించుకుంటే వారికి ముందు ‘పద్మభూషణ్’ ఇవ్వాలి. కులపిచ్చి తలకెక్కిన మరో వింత పార్శ్యమిది! బాబూ, రాజకీయ విన్యాసాలు అనూహ్యం, అపూర్వం, అమోఘం!

తన జీవితకాలంలోనే రాజీవ్ గాంధీ కనీసం ఒకసారి ఎన్నికలలో ఓడిపోయారు.. అయినా ఆయన పేర హైదరాబాదులో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. చెన్నైలో ఐటీ కారిడార్ పేరు రాజీవ్ గాంధీ శాలై.

అంతెందుకు? మన రాష్ర్టాన్ని పాలించి, ఆక్సిడెంటులో కన్నుమూసిన రాజశేఖర రెడ్డిగారి పేరు ఒక జిల్లాకు పెట్టారు. మంచిదే. ఇంకా రెండేళ్ళయినా తిరగకుండా, అదే పార్టీ హయాంలో, అదే ప్రభుత్వం అదే నాయకుని పేరుని ఆ నాయకుని కొడుకు మీద పెట్టిన క్రిమినల్ కేసులో పేర్కొంది!

మన దేశంలో వ్యవస్థల్ని గబ్బు పట్టించడానికి మెజారిటీ మద్దతు చాలు. మన అరాచకానికి ప్రజల హిస్టీరియా చాలు.

ఇటలీలో విమానాశ్రయాల పేర్లు – గెలిలియో, మైకెలాంజిలో, అమెరిగో విస్గూచీ, లియొనార్డో డివించీ, ఫెడిరికో ఫెలినీ – మానవాళిని ప్రభావితం చేసిన – తరతరాలు ఆరాధిస్తున్న మహనీయులు వీరంతా.

మనకి రాజీవ్ గాంధీ, ఎన్.టి.రామారావు, రాజశేఖర రెడ్డి, – వీరి గొప్పతనాన్ని మనం శంకించనక్కరలేదు. ఆయా కాలాల్లలో ఆయా పార్టీలకి పెద్దరికం వహించిన పెద్దలు వీరు. కాని మరిచిపోకూడదు. వీరి జీవితకాలంలోనే ప్రజలు వీరిని తిరస్కరించిన సందర్భాలున్నాయి. రాజకీయాలలో మెజారిటీకీ సర్వకాలికమైన మహనీయతకూ బోలెడంత తేడా ఉంది. దూరం ఉంది. మైకెలాంజిలోకి బెర్లుస్కోనీకి ఉన్నంత తేడా. (మన దేశంలో నాయకుల పేర్లు చెప్పడానికి మొహమాటపడి ఈ విదేశీ ఉపమానంతో కక్కుర్తి పడుతున్నాను.)
చెప్పుల్ని విమానాల్లో తెప్పించుకునే నాయకులకు మనమే కారణం. మెజారిటీ ఉదాత్తతని ఇవ్వదు. అసమర్ధుడికి అహంకారాన్ని ఇస్తుంది. కుసంస్కారికి కుహనా ఆధిపత్యాన్ని అంటగడుతుంది. చెప్పుల్ని ఆకాశంలో ఊరేగిస్తుంది. మరోసారి ఎన్నికయితే ఉతర ప్రదేశ్ మాయా ప్రదేశ్ అవకపోతే నేను చెవి కోయించుకుంటాను.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.