Main Menu

Gollapudi columns ~ Moodu ‘Cheppula’ Kathalu(మూడు ‘చెప్పుల’ కథలు)

Topic: Moodu ‘Cheppula’ Kathalu(మూడు ‘చెప్పుల’ కథలు)

Language: Telugu (తెలుగు)

Published on: May 27, 2013

Moodu Cheppula Kathalu(మూడు చెప్పుల కథలు)     

ఎన్‌.టి.రామారావు గారు ‘దాన వీర శూర కర్ణ’ మొదలైన చిత్రాలు చేసే రోజుల్లో చాలా బిజీ. నేనూ చాలా చిత్రాలకు రాసే రోజులు. రామారావుగారితో ఎప్పుడు చర్చలు జరపాలన్నా, కథ చెప్పాలన్నా, జరుగుతున్న కథకి సవరణలు వినిపించాలన్నా ఉదయం మూడు గంటలకు ఆయన దగ్గరకు వెళ్లాలి. బహుశా ఏ రెండుకో రెండున్నరకో లేచి, కాలకృత్యాలు తీర్చుకుని పట్టుపంచె కట్టుకుని ముందుగదిలో కూర్చునేవారు. చక్కని అగరొత్తుల పరిమళం ఆయన గదిలో గుప్పుమనేది. మేం వచ్చేసరికి శ్రీమతి బసవతారకం గారితో కూర్చుని పెద్ద గ్లాసులో టీ తాగేవారిద్దరూ. మేం వచ్చాక ఆవిడ వెళ్లిపోయేవారు లోనికి. బహుశా ఇద్దరూ కలిసిమాట్లాడుకునే అరుదైన క్షణాలు అవేనేమో. తర్వాత అయిదున్నర, ఆరయేసరికి మా చర్చలు పూర్తయేవి. మేకప్‌మాన్‌ పీతాంబరం వచ్చేవాడు. ఈలోగా వంటవాడు వచ్చి భోజనానికి ఏం చెయ్యాలో అడిగేవాడు. మేకప్‌ అయేసరికి తిరుపతి బస్సులు వచ్చేవి.

వారందరినీ పలకరించి ఏ ఏడుగంటలకో లోనికి వెళ్లి సుష్టుగా భోజనం చేసి -ఓ గంట నిద్రతీసేవారనుకుంటాను. దాదా పు ఇదీ దినచర్య. అంతక్రమశిక్షణ, కర్తవ్యదీక్ష నభూతో నభవిష్యతి.

ఇప్పుడు చెప్పుల కథ. ఆనాటి చర్చలు పూర్తయాయి. ఇద్దరమే ఉన్నాం. ఇద్దరం లేచాం. ఆయన పౌరాణిక గెటప్‌తో సిద్ధంకావాలి. పీతాంబరం పక్క గదిలో సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరం బయటికి వచ్చాం. నేనింక బయలుదేర వచ్చునని ఆయన సూచన. కాని నేను కదలను. వెళ్తే లోపలికి -మేకప్‌కి వెళ్లాలని ఆయన ఉద్దేశం. నేను కదలడం లేదు.

కాలయాపనకి ఏవో చిల్లర కబుర్లు జరుగుతున్నాయి. ఇక ఉండబట్టలేక ”పదండి. టైమవుతోంది మీకు” అన్నారు. అప్పుడిక నాకు చెప్పక తప్పలేదు. ”మీరు నా చెప్పులు తొడుక్కున్నారు” అన్నాను. అప్పుడాయన చూసుకుని నవ్వుకున్నారు. విప్పి నాకిచ్చారు. బయలుదేరాను. ఆయనకీ ఎంత లేదన్నా నిద్రమత్తు ఏ కాస్తో మిగిలే సమయమది. ఈ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా నవ్వొస్తుంది.

రెండో కథ. చెన్నైలో మొన్ననే జరిగింది. సంగీత కచ్చేరీకి వెళ్లాను. కొన్ని సభలవారు చెప్పులతో లోనికి రాకూడదంటారు. మైలాపూర్‌లో ఈ సభ అలాంటిది. చెప్పులు బయట వదిలివెళ్లాను. తీరా కచ్చేరీ అయాక బయటికి వస్తే నా చెప్పులు లేవు. ఎవరో తొడుక్కుని వెళ్లిపోయారు. పొరపాటా? దొంగతనమా? ఏదైనా ఇబ్బందే. చెప్పులు లేకుండా కారెక్కాను.

తెల్లారితే అమెరికా ప్రయాణం. కొత్త చెప్పులు ఉదయమే కొనుక్కున్నాను. మరునాడూ అక్కడే కచ్చేరీ. నా విమానం రాత్రి మూడింటికి. కచ్చేరీకి వెళ్లాను. బయట వదిలిన చెప్పుల్లో నా చెప్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆనందంగా తొడుక్కుని కారెక్కాను. మరి ఈనాడు కొనుక్కున్న చెప్పులు ఎక్కడున్నాయి? కొత్త చెప్పులు నిన్నటిలాగే పోతాయని కారులో వదిలేశాను. కనుక నా చెప్పులు తొడుక్కోవడం నాకు అనువైంది. ఇక్కడో మీమాంస. నిన్న నా చెప్పులు తొడుక్కుపోయిన పెద్దమనిషి పొరపాటు చేశాడా? తను తొడుక్కున్న చెప్పులు గుర్తు పట్టలేకపోవడం నమ్మశక్యం కాని విషయం. కావాలనే దొంగతనం చేస్తే -ఇవాళ్టి కచ్చేరీ మళ్లీ అతన్ని ఇక్కడికి తీసుకొచ్చింది. 24 గంటలు నా చెప్పులు నాకు దూరమయాయి. ఒక్కటి మాత్రం నిజం. నిన్న నా చెప్పులు వేసుకెళ్లిన కారణంగా తన చెప్పులు బయట వదిలేసి పోయుంటాడు. ఆయన చేసింది దొంగతనమే అయితే ఇప్పుడు ఈ చెప్పులూ పోయాయి. తనవి నష్టపోవడం శిక్ష. పొరపాటయితే (కాస్త నమ్మశక్యం కాకపోయినా) పొరపాటుకీ ఇదే శిక్ష. తనవి పోగొట్టుకోవడం. ఏమయినా దొంగని కూడా సంగీతం మీద అభిరుచి మళ్లీ ఇక్కడికే తీసుకొచ్చింది.ఇది చెప్తున్నప్పుడు నాకెప్పుడూ గుర్తొచ్చే గొప్ప కథ ఒకటుంది. సర్కసులో కళ్లకు గంతలు కట్టుకుని ఎదురుగా అమ్మాయిని నిలబెట్టి -ఆమె చుట్టూ కత్తులు -ఆమెకు తగలకుండా విసిరే గొప్ప ఫీట్‌ చేసే ఒక గారడీవాడున్నాడు. ఎదురుగ్గా బల్ల దగ్గర నిలబడేది తన భార్య. ఏనాడూ అతని విద్య గురితప్పలేదు. దరిమిలాను అతని భార్య మరెవరితోనో సంబంధం పెట్టుకుందని విన్నాడు.

కోపంతో, పగతో విలవిలలాడిపోయాడు. ఆమెని చంపాలనుకున్నాడు. ఆ పని అతనికి సుళువు. ఒకరోజు ఒక్క కత్తి గురితప్పితే చచ్చిపోతుంది. గారడీలో పొరపాటుని ఎవరయినా అర్థం చేసుకోగలరు. కాని పది సంవత్సరాలపాటు మనస్సులో అగ్ని వున్నా, పగ వున్నా ఆ పని చెయ్యలేకపోయాడు. కారణం -అతను గొప్ప కళాకారుడు. మనస్సులో పగకూడా అతని కళలో అపశృతిని కల్పించలేకపోయింది. మనస్సులో స్పర్ద ఉంది కాని,ప్రయత్నించినా తన కళలో కళంకాన్ని తెచ్చుకోలేకపోయాడు.చెప్పులు ఎత్తుకుపోయిన దొంగ నిజంగా దొంగయితే కర్ణాటక సంగీతాన్ని విడిచిపెట్టలేని వాడు. కారణం -తను పొరపాటు చేసినా అభిరుచి మళ్లీ అతన్ని అక్కడికి తీసుకొచ్చింది. కనుక చెప్పులు నష్టపోయాడు.

మూడో కథ. అద్భుతమైన వేదాంతాన్ని, జీవన దృక్పథాన్ని చెప్పుల ప్రసక్తిలో ముడిపెట్టిన కవి పద్యం. కవికోకిల దువ్వూరి రామిరెడ్డిగారు ”పానశాల” అనే పేరిట -ఉమర్‌

ఖయ్యాం రుబాయీలను తెనుగు చేశారు. ఒక పద్యం-

మునుపు మసీదు వాకిటను

ముచ్చెలు దొంగిలిపోతి, పాతవై

చినిగెను, నేడునున్‌ మఱల

చెప్పులకోసమే వచ్చినాడ నె

మ్మనము సెడంగ నియ్యెడ

నమాజొనరింపగ రాను నీవు చ

చ్చినయెడ వీడిపోయెదవు

చెప్పులవోలె నమాజు సైతమున్‌.

నా ఎస్సెల్సీలో (అంటే 59 సంవ త్సరాల కిందట) చదువుకున్న పద్యమిది!

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.