Main Menu

Gollapudi columns ~ Olympics: Oka Adbutham(ఒలింపిక్స్‌: ఒకఅద్భుతం)

Topic: Olympics: Oka Adbutham(ఒలింపిక్స్‌: ఒకఅద్భుతం )

Language: Telugu (తెలుగు)

Published on: July 30, 2012

Olympics: Oka Adbutham(ఒలింపిక్స్‌: ఒకఅద్భుతం)     

కొన్ని క్రీడల్ని చూస్తున్నప్పుడు -ఇంత చిన్నవయసులో -యింత సుతిమెత్తని శరీరాల్లో ఈ క్రీడాకారిణులు ప్రపంచాన్ని జయించాలనే వజ్రసంకల్పాన్నీ, జయించే ప్రతిభనీ భగవంతుడు ఎలా సిద్ధం చేశాడా అని ఆశ్చర్యం కలుగుతుంది. తొలి వింబుల్డన్‌ విజయం నాటి మేరియా షారాపోవా, అలనాటి మార్టినా హింగిస్‌, 16 ఏళ్లనాటి ఒలింపిక్స్‌ క్రీడాకారిణి కెర్రీ స్ట్రగ్‌ కొన్ని ఉదాహరణలు. సరిగ్గా 16 ఏళ్ల కిందట అప్పటి 18 ఏళ్ల అమ్మాయి కెర్రీ స్ట్రగ్‌ ప్రపంచాన్ని జయించిన అద్భుతమయిన కథని ఆ రోజుల్లోనే ఒక కాలమ్‌ రాశాను. ఒలింపిక్‌ క్రీడలు ఇంగ్లండులో ప్రారంభమయిన ఈ సందర్భంలో ఆ అనూహ్యమైన విజయాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకోవడం విషయాంతరం కాదు. ఒలింపిక్‌ చరిత్రలోనే అది మరిచిపోలేని క్షణం. ప్రపంచమంతా విస్తుపోయి చూసిన క్షణం. అందరి కళ్లల్లో నీళ్లు తిరిగిన క్షణం. మానవుని సంకల్పబలానికి శారీరకమైన పరిధులు కూడా అడ్డంగా నిలవలేవని 18 ఏళ్ల అమ్మాయి నిరూపించిన అపూర్వమైన సందర్భం. క్రీడా స్థలంలో ఉన్న 32 వేలమంది, టీవీల్లో చూస్తున్న లక్షలాదిమంది గుండె చప్పుళ్లు ఒక్కక్షణం నిలిచిపోయిన క్షణం.

అది ‘జిమ్నాస్టిక్స్‌’ పోటీ. వాల్ట్స్‌ మీద క్రీడాకారిణులు చేసే విన్యాసాలు. విన్యాసం ముగిశాక వాల్ట్స్‌ మీదనుంచి చివర కిందకి దూకాక తడబడకుండా క్రీడాకారిణి ఒక్కక్షణం నిలవాలి. అప్పుడూ క్రీడ పూర్తయినట్టు. ఈ క్రీడలో సాధారణంగా ముందు నిలిచే రష్యా, రుమేనియా ఆనాడు వెనుకపడ్డారు. అమెరికా క్రీడాకారిణి కెర్రీ స్ట్రగ్‌ ముందంజ వేసింది. అయితే తొలి రౌండ్స్‌లో ఆమెకి ముణుకు దగ్గర బెణికింది. దాన్ని ప్రేక్షకులు గుర్తించారు. కోచ్‌ కెరోల్యీ కూడా గుర్తుపట్టాడు. ఇక ఆఖరి అవకాశం ఉంది. ఈ రౌండు పూర్తి చేయగలిగితే స్వర్ణం ఆమెదే. కాదు అమెరికాది.

”ఆగిపోతేనో!” అంది స్ట్రగ్‌.

”వద్దు. నువ్వు గెలుస్తావమ్మా. నువ్విప్పుడు కెర్రీవి కావు. ఒక దేశానివి” అని ప్రోత్సహించాడు కెరోల్యీ. వస్తున్న కన్నీళ్లని బనీనుతో తుడుచుకుంది. వాల్ట్స్‌ దాకా వెళ్లడానికే కాళ్లు సహకరించలేదు. ప్రేక్షకులకూ ఆమె బాధ అర్థమౌతోంది.

ఒక్క పరుగులో ఎగిరి వాల్ట్స్‌ మీద విన్యాసం చేసి దూకింది. అంతే. కాలి మణికట్టు దగ్గర ఎముక విరిగింది. విరిగిన శబ్దం అందరికీ తెలిసింది. ఆమె శరీరంలో ప్రకంపన తెలిసింది. ప్రేక్షకులు 32 వేలమందీ గతుక్కుమన్నారు. ప్రపంచం ఆ క్షణంలో ఊపిరి బిగబట్టింది. ఆ దశలో ఆమె ఆమె కాదు. ఒక దేశపు ఘనత. ఒక లక్ష్యానికి సంకేతం. ఆమె జీవితంలో కాదు, దేశ చరిత్రలో కాదు -ఒలింపిక్స్‌ చరిత్రలో ఒక మైలురాయి. గాలిలోకి లేచింది. ఎత్తివేసే ప్రతి అడుగులోనూ విరిగిన ఎముక మరింత తునాతునకలవుతోంది. గాలిలో ఒకటిన్నర మొగ్గ. విరిగిన కాలిమీద నేలమీదకు దిగాలి. అదొక భయంకరమైన క్షణం శరీరానికి. కాని అదొక అద్భుతమైన చరిత్ర -దేశానికి, ఒలింపిక్స్‌కి.

ఇదే భగవద్గీత. ‘నియతం కురు కర్మత్వం…’
,h4>ఈసారి మరిన్ని ఎముకలు విరిగాయి. నిలదొక్కుకుని నిలుస్తుందా? ప్రపంచమంతా ఒక్కటయి ఆమె నిలవాలని ప్రార్థించింది. ఊపిరి బిగబట్టింది. ఒక్కక్షణం. నిలిచింది కెర్రీ స్ట్రగ్‌. ప్రపంచం నిలబడి నివాళులర్పించింది. న్యాయనిర్ణేతలూ నివ్వెరపోయారు. ఇది ఒక క్రీడాకారిణి ప్రతిభకే కాదు. అద్భుతమైన లక్ష్యశుద్ధికీ సంకల్పబలానికీ విజయం. ఒక్క క్షణం తర్వాత -నేలమీద కుప్పలాగ కూలిపోయింది స్ట్ర గ్‌. కోచ్‌ కెరోల్యీ వచ్చి ఆమెని గర్వంగా రెండు చేతుల్లోకీ ఎత్తుకున్నాడు.

”వెళ్లి స్వర్ణాన్ని అందుకోవచ్చా?” అంది కెర్రీ.

”ప్రపంచమంతా ఎదురయినా నీతో నేను నిలబడతానమ్మా” అన్నాడు కెరోల్యీ. ఆ ఫొటో ఒక అద్భుతమైన జ్ఞాపకం.”భగవంతుడు అందమైన రబ్బరు బొమ్మల్ని తయారు చేసి అందులో ఎముకల్ని ఉంచడం మరిచిపోయాడేమో!” అన్నాడో పాత్రికేయుడు ఈ విన్యాసాన్ని చూసి. అతను పొరపాటు పడ్డాడు. భగవంతుడు ఎముకల్ని ఉంచి అందులో అనూహ్యమైన చిత్తశుద్ధినీ, సంకల్పబలాన్నీ ఊహించలేని పదార్థంతో నింపాడు.

ఇది 1996లో జరిగింది. ఇప్పుడు కెర్రీ స్ట్రగ్‌కి 34. ఆమె ఒలింపిక్స్‌ క్రీడల్లో చరిత్ర.

మనిషి మనస్సులో ఏర్పరుచుకున్న సాధనాబలంతో శరీరానికి మించిన లక్ష్యాల్ని సాధించవచ్చునని నిరూపించిన అమృత క్షణాలవి.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.