Main Menu

Gollapudi columns ~ Railu Prayanam(రైలు ప్రయాణం)

Topic: Railu Prayanam(రైలు ప్రయాణం)

Language: Telugu (తెలుగు)

Published on: Jan 21, 2013

Railu Prayanam(రైలు ప్రయాణం)     

మనం చాలాసార్లు రైలు ప్రయాణం చేసి ఉంటాం. చేస్తూనే ఉంటాం. మన కళ్ళ ముందునుంచి స్టేషన్లు వెనక్కు వెళ్ళిపోతూంటాయి. అనకాపల్లి దాటాక ఎలమంచిలి వస్తుంది, తరువాత తుని. తరువాత అన్నవరం వస్తుంది. మరేదో మరేదో. దాటిపోయే స్టేషన్లు మన గమనానికి గుర్తు. కానీ ప్రయాణమంతా మనతో వచ్చే కొన్ని దృశ్యాలుంటాయి. పచ్చని పొలాలూ, అక్కడక్కడ చెరువులూ, కాలవలూ, ఎగిరే పక్షులూ, మీద నీలపుటాకాశం – ఇలాగ. ప్రయాణంలో స్టేషన్ మజిలీ. మనతో కదిలే దృశ్యం ప్రయాణాన్ని అలంకరిస్తుంది – మనకి తెలియకుండానే. చాలామందికి స్టేషన్లు గుర్తుండవు. కానీ అందరికీ ప్రయాణం ఇచ్చిన అనుభూతి గుర్తుంటుంది – తప్పనిసరిగా. ప్రయాణానికి అనుభూతే ప్రాణం. గమ్యం లక్ష్యం.

గమనించండి. మన కాల ప్రయాణంలోనూ చాలా స్టేషన్లు ఉన్నాయి – గాంధీ జయంతి, స్వాతంత్ర్య దినం, సంక్రాంతి, వివేకానంద జయంతి, విజయదశమి, దీపావళి – ఇలాగ. గాంధీ జయంతి రోజంతా దేశంలో ప్రతీ నాయకుడూ గాంధీజీ గురించి ఊదరగొట్టేస్తాడు. ఎక్కడెక్కడి విగ్రహాలమీదా దండలు గుమ్మరించేస్తారు. మన మీడియా పుణ్యమాని పేపర్లన్నీ, టీవీలన్నీ వార్తలతో నిండిపోతాయి. మనం వివేకానందుడీ సందేశాన్ని పాటించాలని – అవినీతి కేసులు కోర్టుల్లో మురుగుతున్న నాయకుడు మనకి నీతిని చెప్తాడు – (మాయాబజారులో సీఎస్సార్ అన్నట్టు సిగ్గులేకుండా.) మనం వింటూంటాం. విజయదశమికి విగ్రహాలను రకరకాల కార్పొరేటర్లు, మంత్రులూ, నాయకులూ దండలతో అలంకరిస్తారు. ఈ దేశంలో ఇంత భక్తి వెల్లివిరుస్తోందా అని మనకు గర్వపడాలనిపిస్తుంది. కానీ మరునాడే – ఆ ఆలోచనా, ఆ ఆదర్శం, ఆ సందేశం అటకెక్కిపోతాయి. వివేకానందుడు ఎవరు? అని ఏ నాయకుడినయినా అడగండి. ఆయన కంగారు పడతాడు అడిగింది పెద్దమనిషి అయితే. తన మనిషే అయితే “నీకు బుద్దుందా లేదా?” అని విసుక్కుంటాడు. ఆయన సందేశం ఆనాటి సభకే ప్రత్యేకం. మర్నాటినుంచీ మానభంగాలూ, సబ్సిడీలూ, పాదయాత్రలూ, అవినీతి కేసులూ, కోర్టుల విచారణల్లూ – మామూలు ‘మురికి ‘ జీవితం.

మజిలీలను మరిచిపోయినా దారి పొడుగునా పచ్చని పొలల పలకరింత ఆనాటి ప్రయాణం. గాంధీ జయంతి దాటిపోయినా ఆయన ఆదర్శం ప్రయాణమంతటా పరుచుకున్న ఆరోగ్యకరమైన దినాలు – ఆనాటివి. పండగలు ప్రతీకలై – ప్రయాణం ఆదర్శమై – రైలు యాత్ర ఆరోగ్యకరమైన ప్రస్థానమయేది.
ఈనాడు ఆదర్శమూ, వివేకానందుడి సందేశమూ ‘మజిలీల’ స్టేషన్ ల స్థాయిలోనే నిలిచిపోయాయి – మురికి బతుకే ప్రయాణంగా సాగే యాత్ర. ప్రయాణం దృక్పధమూ, దృష్టీ మారిపోయింది. సంప్రదాయం కేవలం ఆచారంగా కొన ఊపిరితో మిగిలి – ఇంకా ఆనవాయితీగానే నిలిచి – అది కూడా క్రమంగా ఒక తతంగంగా మీడియాకు మాత్రమే అమ్ముడు పోయింది. ఆ రోజుల్లో పండగలు, పబ్బాలూ సమాజాన్నీ, వ్యక్తినీ ప్రభావితం చేసే సైన్ పోస్టులు. వాటి ఉద్దేశమూ, నిర్దేశమూ అదే. మనకి ఇప్పుడా స్దృష్టే మృగ్యమైపోయింది. డిసెంబరు 31న తాగుడు పార్టీలూ, జనవరి ఒకటిన బసొటా డిన్నర్లు, వాలంటీన్ డేనాడు ఆడామగా విచ్చలవిడి డాన్సులూ, మదర్స్ డేనాడు వృద్దాశ్రమాలకు స్వీట్ పాకెట్, పూల గుత్తి రవాణాలూ – గాంధీ, వివేకానందుడు, ఆఖరికి గణేశ్ ఉత్సవాలూ రాజకీయమైన ‘సింబల్స్ ‘గానే రూపుదిద్దుకున్నాయి.

ఉదాహరణకి – 364 రోజులు నగర ప్రజానీకం భరించాల్సిన హుస్సేన్ సాగర్ కాలుష్యాన్ని ఒక్క రోజులో చేస్తున్న గణేశ్ నిమజ్జనాన్ని ఎవరయినా జంట నగరాల్లో ఆపగలరా? భగవంతుడి పేరిట అనారోగ్యాన్ని కోరి కోరి, తెలిసి తెలిసి నెత్తిన వేసుకుంటున్న విషయం – ఇంత తెలివైన ప్రజానీకానికి తెలియదా? ప్రతీ వినాయకుడి వెనకా ఓ కార్పొరేటరో, ఓ మంత్రో, ఓ రాజకీయనాయకుడో, ఓ భక్తుడో ఉంటాడు. సామూహిక మూర్ఖత్వం ‘భక్తి’గా చెల్లుబాటయే ప్రజాస్వామిక వ్యవస్థ మనది.

తెల్లారి లేస్తే నవరాత్రి ఉత్సవాల వెనుక భక్తి కంటే సాముహిక ప్రవృత్తిని చూపుకునే వ్యాపారమో, వ్యాసంగమో ఎక్కువయిపోయింది. పేపర్లలో ఫోటోలూ, నాయకులు తెలిసీ త్లైయని (ఎక్కువగా తెలియవన్న విషయం మనకి స్పష్టంగా తెలిస్తూంటుంది) అమ్మవారి గురించి మనకి చెప్పే ఊదరగొట్టుడు – పత్రికల్నీ, టీవీ తెరల్ని నింపేస్తాయి. ఎలమంచిలి దాటిపోయింది.

పచ్చని పొలాలు, చెరువులూ ఎవడిక్కావాలి? లావాదేవీలు, వ్యాపారాలు, కక్షలూ, రాజకీయాలూ, లాకప్ లూ – మళ్ళీ మరో మజిలీ దాకా ప్రయాణం.
గణేశుడి మీద ఇదివరకు ఇంత భక్తి ఎరగం. ఇన్ని కెమెరాలు లేవు. ఇంతమంది నాయకులు లేరు. ఇన్ని టీవీలు లేవు. అమ్మవారి మీద ఇంత బరితెగించిన భక్తిలేదు. కానీ ఆ రోజులనాటి భక్తిలో ఆధ్యాత్మిక సాంద్రతా, ఔదార్యం, మానవ మనుగడలో గాంభీర్యం ఉండేవి. ఆనాటి ప్రయాణంలో పచ్చని పొలాలది పెద్దవాటా. గాంధీజీ ఇచ్చిన సందేశం జీవితమంతా పరుచుకోవాలనే ఆర్తి.

ఈనాడు గాంధీ ఒక మైలు రాయి. నేరస్తుడైన ఓ ఎమ్మెల్యేగారు – ఆరోజుకి మాత్రం, ఆ సభలోనే, ఆ ఒక్కసారే, ఆ ఒక్క ఫోటోల వరకే మనకి అహింస గురించి, శాంతియుత సహజీవనం గురించీ చెప్తారు. ఆ నిజాన్ని ఆయన నమ్మి ఆచరించడం లేదని మనకి తెలుస్తుంటుంది. ఆయనకీ పాపం – నమ్మకం లేని విషయం మనకీ అర్ధమవుతూ ఉంటుంది. ఈనాటీ ప్రయాణంలో గాంధీలు, వివేకానందులూ, విఘ్నేశ్వరులూ, దుర్గామాతలూ – ఆయా పండుగలకు పెట్టుబడులు. కేవలం వార్షిక మర్యాదలు. ఆ రోజులకే పరిమితమైన వ్యాపారాలు. కొండొకచో తద్దినాలు.

ఇప్పటి ప్రయాణంలో ఆ ‘మజిలీలు’ నిర్దేశించిన ఆదర్శం మచ్చుకైనా లేదు. స్టేషన్ల మధ్య పచ్చని పొలాలు లేవు. బీటలు వారిన బీళ్ళు, అర్ధం పర్ధం లేని దృశ్యాలూ చోటు చేసుకున్నాయి. నిన్నటికి నిన్న – పత్రికల్లో చెలరేగిన సంక్రాంతి హోరుని చూశాక ఈ నిజం కొట్టొచ్చినట్టు కనిపించిచింది.

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన ఉత్తరాయణ పుణ్యకాలంలో – పంటని ఇంటికి తోలుకొచ్చిన రైతు – తన సంపదని చుట్టూ ఉన్నవారితో – ఏటేటా వచ్చే మాలదాసరితో, గంగిరెద్దుల సామితో, భజన బృందాలతో, పగటి భాగవతులతో, పాలేళ్ళతో పంచుకుని పండగ చేసుకుని – తనకి ఏడాది పొడుగునా బాసటగా నిలిచిన మూగజీవాలు – పశుసంపదకి కనుమ రోజున ‘కృతజ్నత’ చెప్పుకునే సత్సంప్రదాయాన్ని – టీవీల్లో మొరిగే, పత్రికల్లో గొంతు చించుకునే, వృద్దాశ్రమాలకు తల్లితండ్రుల్ని అప్పచెప్పి విదేశాల్లో మాయమయిన రైతన్న బిడ్డలు ఎందరికి తెలుసు?

పండగలూ, పబ్బాలూ జన జీవనాన్ని ప్రభావితం చెయ్యాల్సిన ఒక నిరంతన ప్రభావ శీలానికి సంకేతాలు. ఈనాడు పబ్బం గడుపుకుని, వ్యాపారమో, గూండాయిజమో వృత్తిగా జీవితమంతా కప్పల తక్కెడ చేసుకునే అవ్యవస్థలో కేవలం సైన్ పోస్టులుగా మిగిలిపోయాయి. ఈనాటి రైలు ప్రయాణం దృష్టి పూర్తిగా మారిపోయింది. పొరపాటు. పూర్తిగా దృష్టి మాసిపోయింది.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.