Main Menu

Gollapudi columns ~ Pedarikam pettubadi (పేదరికం పెట్టుబడి )

Topic: Pedarikam pettubadi (పేదరికం పెట్టుబడి )

Language: Telugu (తెలుగు)

Published on: Jun 28, 2010

Pedarikam pettubadi (పేదరికం పెట్టుబడి )     

ప్రతి మంగళవారం మా పెద్దబ్బాయి వడపళనిలో కుమారస్వామి గుడికి వెళుతుంటాడు. ఆ గుడి ముందు ఓ 65 సంవత్సరాల ముసిలావిడ బిచ్చమెత్తుకుంటుంటుంది. నాకోసారి ఆమెని చూపించాడు. ఆమెకి ఓ వసతిని కలిపించాలని అనుకుంటున్నట్టు చెప్పాడు మంచిపని. ఓ వృద్ధాశ్రమంతో మాట్లాడి, ఆమెని చేర్చుకోడానికి డబ్బు కట్టి, ఆమెను అక్కడికి తీసుకెళ్ళి విడిచి పెట్టాడు.ఆమెకి కావలసిన చీరలు కొనిపెట్టాడు.

సరిగ్గా రెండు వారాలు తిరగకుండా ఆ ముసిలావిడ గుడిముందుకు వచ్చేసింది. కళ కళలాడుతూ, ప్రశాంతంగా ముష్టి ఎత్తుకుంటూ కనిపించింది.

ఉపాధి కొందరికి బోర్ కొడుతుంది. కాగా లాభసాటి కాదు. పేదరికంలో కొందరికయినా థ్రిల్ ఉంది. ఏ రోజు ముష్టిలో ఆ రోజు కొత్త అడ్వంచర్ ఉంది. కొత్త రాబడి ఉంది. వ్యాపకం ఉంది. అన్నిటికీ మించి నలుగురి మధ్యా గడిపే అవకాశం ఉంది.

ఈ సంవత్సరం తొలి రోజుల్లో తమిళనాడు డి.ఎం.కె ప్రభుత్వం స్కూళ్ళల్లో చదువుకుంటున్న పిల్లలందరికీ సైకిళ్ళు ఇవ్వాలని నిర్ణయించింది. అది గొప్ప ఉపకారం. నేను రోజూ కచ్చేరీకి హాజరయే మైలాపూర్ పి.ఎస్.హైస్కూలు ప్రాంగణంలో కొన్ని వందల సైకిళ్ళను పార్టులన్నీ చేర్చి సిద్దం చేశారు. అన్నీ లేత నీలం రంగు సైకిళ్ళు. పిల్లలకు ఇచ్చారు. ఆ తర్వాత – ఒక్కరోజు – ఒక్కరోజయినా – ఒక్క విద్యార్ధి అయినా – ఆ సైకిలు మీద స్కూలుకి రావడం నేను చూడలేదు. కాగా సైకిళ్ళ మీద కూరగాయలు, పళ్ళు అమ్ముకునే వాళ్ళూ, వాచ్ మెన్ లూ, పాలవాళ్ళూ, పేపర్ బోయ్ లూ ఆ సైకిళ్ళు తొక్కుతూ కనిపించారు. పేదవాడికి వెయ్యి రూపాయల సైకిలు చేతికొచ్చింది. అతని ఆనందం దాని వినియోగం కాదు. దాని ద్వారా వచ్చే రెడీ కాష్. దాన్ని ఏ అయిదు వందలకో అమ్మేసి నాలుగు రోజులపాటు మందు ఖర్చుగా తర్జుమా చేసుకుంటాడు. లేదా కూరలు కొనుక్కుంటాడు. లేదా పెళ్ళాన్ని సినిమాకు తీసుకువెళతాడు. మరి కుర్రాడు? రోజూ నడిచే స్కూలుకి వెళుతున్నాడు. ఇప్పుడూ వెళతాడు.

ప్రభుత్వం సదుద్దేశంతోనే గుడిసెల్లో ఉండేవాళ్ళకి ఇళ్ళు కట్టించి ఇచ్చింది. మెరీనా బీచ్ లో లైట్ హౌస్ కి పక్కన వందలమందికి వసతి ఫ్లాట్లు కట్టించి ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే ఆ వందల ఫ్లాట్లలో ఉండే 95 శాతం వారు అద్దెకున్నవారు. మరి పునరావాసితులయిన వారెక్కడ? గవర్నమెంటు ఔదార్యాన్ని సొమ్ము చేసుకుని నగరంలో మరో చోట గుడిసెని వేసుకున్నారు. ఈసారి కొడుకు పేర ప్లాటు వస్తుంది. ఇలా రెండు మూడు ప్లాట్ల అద్దెతో వేపేరీ, అయినవరం రైల్వే లైన్ల పక్క మురికివాడల్లో మూడు పువ్వులూ ఆరు కాయలుగా జీవిస్తున్నారు.

డిఎంకె ప్రభుత్వం కిందటి ఎన్నికల్లో చాలామందికి ఉచితంగా కలర్ టీవీలు పంచింది. పేదవాడికి కలర్ టీవీని ఇవ్వడం ఉపకారం కాదు. కొత్త బాధ్యత. కలర్ టీవీ వాడడానికి ముందు కరెంటు కావాలి. టీవీ చూశాక కరెంటు చార్జీలు కట్టుకునే స్తోమతు కావాలి. అన్నిటికీ ముందు టీవీ ముందు కూర్చుని చూసి ఆనందించే వ్యవధి కావాలి. ఇంకా ముందు తీరికను ఇవ్వగలిగే ఆదాయం కావాలి. వెరసి – కలర్ టీవీ ఇచ్చే ఆనందానీ పేదవాడికీ మధ్య నాలుగు మజిలీలు ఉన్నాయి.

ఒక నమూనా పేదవాడిని తీసుకుందాం. రైల్వే కళాసీ. ఉదయం అయిదు నుంచీ రాత్రిదాకా రెక్కలు ముక్కలు చేసుకుంటాడు. పెళ్ళాం ఏ కూలిపనో చేస్తుంది. ఇద్దరూ ఇల్లు చేరతారు. ఇద్దరూ ఉడుకు నీళ్ళు స్నానం చేసి ఇద్దరూ చెరో వంద మిల్లీల సారాని బిగించి, వేడి వేడి గంజి తాగి మంచం మీద పడిపోతారు. మళ్ళీ పొద్దుటే చాకిరీ. మరి ఇంట్లో కలర్ టీవీ మాట? గుడిసెలో కలర్ టీవీ పెట్టుకుని కాలు మీద కాలేసుకుని ఆనందించే వ్యక్తి మానసిక, ఆర్ధిక, నైమిత్తిక సంస్కారానికీ వాస్తవానికీ చాలా దూరం ఉంది.

కలర్ టీవీ దాకా ప్రయాణం చెయ్యడానికి – అతని ఉపాధి స్థాయి మెరుగుపడితే, ఆ విధంగా ఆదాయం సమకూరితే, తన బిడ్డకి పదో తరగతిదాకా చదువు చెప్పించుకోగలిగితే, ఆ కుర్రాడు టీవీ చూడాలని ఉత్సాహపడితే, తనకు లేని, సాధ్యం కాని exposure కొడుక్కి కల్పించాలన్న ధ్యాస – మూల కారణం టీవీ కాదు – కొడుకు

జిజ్నాస – గమనించాలి – అప్పుడు కళాసీ కష్టపడి కలర్ టీవీ కొంటాడు. భార్య ఆ టీవీ మీద ఓ పువ్వుని ఉంచి తన కొడుకు మరో వర్గానికి ప్రయాణం చెయ్యడాన్ని చూసి గర్వపడుతుంది. ఆ దశలో కల టీవీ అభ్యుదయానికి ప్రతీక. గవర్నమెంటు తాయిలం కాదు.

కళాసీ జీవితంలో కలర్ టీవీ నాలుగో మజిలీ. వైజ్నానిక, సాంఘిక విప్లవం. దీనిని సాధించడానికి వ్యవస్థ రెండు తరాల అభ్యుదయానికి ఊతం ఇవ్వాలి. కాని -మెజారిటీ, అధికారం, పదవిని మాత్రమే నమ్ముకునే రాజకీయ అల్పాయుష్కులకు అంత వ్యవధి ఎక్కడుంది? ముందు ఎన్నికలకి తాము ఉంటామో ఊడుతామో తెలియని పరిస్థితి. ప్రజల విశ్వాసాన్ని కాక, ప్రజలామోజు ‘ల్ని రెచ్చగొట్టి వాడుకునే ‘యావ ‘.

అందుకే politician thinks of the next day while a statesman thinks of the next generation.

ఏతావాతా, ఏం జరిగిందంటే ఏ గుడిసెలోనూ కలర్ టీవీ కళ్ళు విప్పలేదు. దళారుల సహాయంతో సరసమయిన ధరలకు అమ్ముడు పోయాయి. కలర్ టీవీ సంపాదించుకున్నవాడు చక్కని విందునీ, మందునీ సమకూర్చుకున్నాడు . ప్రభుత్వానికి కావలసిన ఓటుని ఇచ్చాడు. ఇచ్చిపుచ్చుకోవడాలు సరిపోయాయి.

ఆ మధ్య ఇదే ప్రభుత్వం పేదలకు అతి సరసమయిన ధరలకు – అతి ఖరీదయిన, మేలయిన రకం బియ్యాన్ని రేషన్ కార్డుల మీద ఇచ్చారు. రెక్కలు విరుచుకున్న అట్టడుగు అమనిషి అంత ఖరీదయిన బియ్యాన్ని వండుకుంటాడా? మరుసటి వారం నుంచే ఆంధ్రా, కర్ణాటక పొలిమేర్లలో వందలాది బస్తాల బియ్యాన్ని పొరుగు రాష్ర్టాలకు తరలిస్తుండగా దొరికాయి.

ఇన్ని చెప్పాక ఒక్క విషయం చెప్పాలని నా మనస్సు పీకుతోంది. పేదరికం వ్యసనం. ఇప్పటి వ్యవస్థ ఇచ్చే తాత్కాలిక ప్రయోజనాల దృష్ట్యా మంచి పెట్టుబడి. వారి అవసరాలు తీరడం వల్ల ఓట్లు వస్తాయి కాని వారి లోట్లు తీరవు. కాగా, తాయిలాలను ఊరించి పంచేవాళ్ళ అవసరాలేమీటో వీరికి తెలుసు. వాటిని ఉపయోగించుకోవడం అలవాటయిపోయింది.

పేదరికంలోంచి బయటపడడానికి ఒక దృక్పధం కావాలి. ఆ దృక్పధాన్ని సంస్కారం ఇస్తుంది. విద్య సంస్కారాన్ని ఇస్తుంది. పేదల స్థాయినీ, వారి ఆలోచనా పరిధినీ విస్తృతం చేయగల వికాసాన్ని కలిగించాలి.

ఇదే అలనాడు అంబేద్కర్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. ఇదే ఫాటించకుండా రాజకీయ నాయకులు తాయిలాలు పంచి తమ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ‘రిజర్వేషన్లూ కూడా ఈ తాయిలాల లిస్టులో అగ్రస్థానంలో ఉంటాయి. అందువల్ల నిజమైన అట్టడుగు వర్గాలకు టీవీల్లాంటి తాత్కాలిక అవసరాలు తీరతాయి. ఓట్లు పెట్టెలు నిండుతాయి. కాని తరతరాలకు అందవలసిన ‘వికసనం ‘ అందదు. ఈ విషయం కాస్త ఆలోచించగల ఈ వర్గాలలో కొందరికయినా మనస్సులో ఏ మూలో తట్టకుండా పోదు. కాని పబ్బం గడుపుకునే యావ ఆ ఆలోచనని తుంచేస్తుంది.

సినిమా టిక్కెట్లు పంచుతున్నారు. ముందు సినిమా చూడు. “ఆ సినిమా టిక్కెట్టు సంపాదన మార్గం చెప్పండి బాబూ!” అని ఎవరూ అడగరు. కానీ ఇందులో కిటుకు ఏమిటంటే – ఉచితంగా ఇచ్చే టిక్కెట్టుతో – వాళ్ళు చూపెడుతున్న బొమ్మనే మీరు చూస్తున్నారు. ఆ రెండు గంటల వినోదం – తద్వారా ‘రెచ్చే ‘ ఆలోచన ఆ తాయిలాన్ని ‘మప్పిన ‘ వారి అవసరం. మరో మాటలో చెప్పాలంటే – వారి ఆయుధం.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.