Main Menu

Gollapudi columns ~ Prema Pusthakam (ప్రేమ పుస్తకం )

Topic: Prema Pusthakam (ప్రేమ పుస్తకం )

Language: Telugu (తెలుగు)

Published on: Oct 18, 2010

Prema Pusthakam (ప్రేమ పుస్తకం )     

నా జీవితంలో రెండే రెండు సార్లు పరిశోధనాత్మకమైన నవల రాయాలని తహ తహలాడాను. రెండూ రెండు విచిత్రమైన, అనూహ్యమైన సందర్భాలు. రాజీవ్ గాంధీ హత్యలో పాత్రను పోషించిన ఓ నర్స్ కూతురు నళిని గురించి – ఆమె పుట్టుక, పెరిగిన వాతావరణం, ఓ భయంకరమైన మారణ హోమంలో భాగం కావడానికి ఏయే పరిష్తితులు దోహదమయాయో – తీరా అరెస్టు అయాక మురుగన్ ను పెళ్ళిచేసుకుని, అతనితో సెక్స్ లో పాలుపంచుకుని బిడ్డని కనడం – ఇవన్నీ మనస్తత్వ శాస్త్రానికి, విచిత్రమైన కోణాలను ఆవిష్కరించే కథనం. రెండవది –

నిన్నకాక మొన్న – చిలీలో కోపియాపో అనే చోట శాన్ ఓసే రాగి గనుల్లో ఇరుక్కుపోయిన 33 మంది గని కార్మికులను 70 రోజుల తర్వాత బయటికి తీసుకు వచ్చిన అద్భుతమైన సంఘటన. ఈ 33 మంది ఎవరు? ఏ పరిస్థితుల్లో ఇరుక్కున్నారు? చీకటిలో బతుకుతామా లేదా అనే ఆలోచనతో – ప్రపంచంలో ఏనాడూ జరగని రక్షణ చర్య జరుగుతుందని ఊహించలేని ఈ కార్మికుల మొదటి ఆలోచనలేమిటి? ఆలోచించిన కొద్దీ ఆసక్తి, విచికిత్సా పెరిగే కథ. (ప్రముఖ రచయిత జీన్ పాల్ సార్ర్తే ఇలాంటి విషయం మీద ‘మెన్ విదవుట్ షాడోస్ ‘ అనే నాటకం రాశారు) సరైన ఆర్ధిక సహాయం లభిస్తే, ఏప్రచురణ సంస్థో, వ్యవస్థో పూనుకుంటే – కనీసం ఓ రెండు నెలలు చిలీలో ఉండి ఈ అద్భుతానికి సంబంధించిన వివరాలన్నీ సేకరించి – మానవ జీవన శక్తికి గొప్ప నివాళిగా నిలిచే ఈ కథని రాయాలని నా ఆశ.

మానవ జీవితంలో బ్రతుకు మీద ఆశ అతి ప్రాధమికం. చావంటే భయం అతి సాధారణం. ఈ రెంటినీ 33 మంది 70 రోజుల పాటు భూమికి 2042 అడుగుల కింద చుట్టూ విరిగిపడిన గని రాళ్ళ మధ్య ఎలా తట్టుకుని జీవించారు? ఇది మానవుని ధృఢ సంకల్పానికి, స్థైర్యానికీ నిదర్శనం.

అంతర్జాతీయ స్థాయిలో జరగాల్సిన కామన్వెల్తు క్రీడల్లో – 17 వేల కోట్ల నిధులలో కోట్లకి కోట్లు ఫలహారం చేసిన ఘనుల కథలు ఇటీవలే మనం విన్నాం. కాని 33 మందిని రక్షించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ దగ్గర్నుంచి, చిలీలో ఇన్సూరెన్స్ సంస్థల వరకూ ఎంతమంది ఏకమయి అనూహ్యమైన కృషి చేశారో తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది.గని కూలాక కార్మికులు బతికే అవకాశం లేదనుకున్నారంతా. బతకరని పెదవి విరిచారు. ఒకవేళ రక్షించాలన్నా ప్రపంచంలో ఏనాడూ జరగని, ఊహించలేని ప్రయత్నమిది. అంత చిన్న దేశం జరపగలదా? వనరులకి ‘చిన్నతనం’ ఉంది కాని మనస్సుకి లేదు. మానవాళి సామూహిక చైతన్యానికి ‘చిన్నతనం’ లేదు. ఆశ వదులుకోలేదు. ఓ చిన్న రంధ్రం చేశారు. 17 రోజుల తర్వాత గనిలోంచి ఒక కార్మికుడు తన పెళ్ళానికి రాసిన ఒకే వాక్యం ప్రేమ లేఖ, తాము బతికున్నామన్న సందేశం అందింది. అంతే. దేశమంతా – కాదు – ప్రపంచమంతా ఏకమయింది. 15 వారాల పాటు భూమిలోకి మనిషిని బయటికి తీసుకురాగల 28 అంగుళాల పరిధి ఉన్న గొట్టాన్ని తయారు చేశారు. ఇది బయట జరిగే ప్రయత్నం.

లోపల ఏం జరుగుతోంది? ‘ఏది ఏమయినా నిరాశకి తావు ఇవ్వ్వరాదని, చావుకి తలవొంచరాద’ని కార్మికులంతా ప్రతిజ్న చేసుకున్నారు. చావు ఒడిలో ఉన్నవారికి ఎంత ధైర్యం? ఎంత చిత్తశుద్ధి? అలా 17 రోజులు బతికారు. తరువాత బయట ప్రపంచంతో సంబంధం మాట. మానవుడి జీవనశక్తికి ఇది చక్కని ఉదాహరణ.

ఈ 33 మందికీ మొదటి ఊతం – బయట యావత్ ప్రపంచం ఏకమయి తమని రక్షించే ప్రయత్నం చేస్తోందన్న ఆలోచన. తమ వారు – కుటుంబీకులు, దేశీయులు – కాదు – మానవాళి అంతా ఎదురు చూస్తోందన్న నమ్మకం చిలీలో రాజకీయ నాయకులంతా ఏకమయిపోయారు. ప్రజలంతా ఒక్కటయారు. అది మొదటి ప్రభావం. వారితో సంబంధం ఏర్పడగానే – మొదట బ్యాటరీ దీపాలు పంపారు. ఆక్సిజన్ వాయువుని పంపారు.గ్లూకోజ్ పంపారు. వీరిలో కొందరికి రక్తపు పోటు ఉంది. కొందరికి చక్కెర వ్యాధి ఉంది. కొందరికి పంటి వ్యాధులున్నాయి. ఒకరికి ఊపిరి తిత్తుల సమస్య ఉంది. అందరికీ మందులు పంపారు. బట్టలు పంపారు. వారి ఆరోగ్య స్థితిని కనుక్కోడానికి రక్తపు శాంపిల్స్, మూత్రం శాంపిల్స్ గనిలోంచి తెప్పించి పరీక్షలు చేశారు. అవసరమయిన చికిత్స అందింది. గనిలో తేమకి, 90 డిగ్రీల ఫారన్ హీట్ వేడికి వచ్చే రకరకాల చర్మవ్యాధులను తట్టుకోడానికి మందులూ, లేపనాలు పంపారు. కుటుంబాలనుంచి ఉత్తరాలు వచ్చాయి. ఆహారం, పానీయాలు సరేసరి. వాళ్ళ పరిస్థితులను చిత్రించడానికి, వ్యక్తీకరించడానికి రకరకాల తర్ఫీదుల వివరాలు అందాయి.

ఊసుపోవడానికి సినిమా వీడియోలు, బంతాట వీడియోలు వెళ్ళాయి. ఈ 70 రోజుల్లో శరీరానికి అలసట లేక పెరిగితే? 28 అంగుళాల గొట్టంలో దూరలేకపోతే? శరీరం పెరగకుండా మందులు, సూచనలు, జాగ్రత్తలు అందాయి.

ఈ చీకటి గుయ్యారంలోనే ఒక కార్మికుడు రోజూ ఆరు మైళ్ళు పరుగులు తీశాడు. ఒక మనస్తత్వ నిపుణుడు ఇలాంటి సమయంలో ముసురుకునే నిర్వీర్యం, నిస్పృహ, నిర్వేదం కృంగదీయకుండా ‘ఏంటీ డిప్రసెంట్’ మందుల్ని పంపి, బయటనుంచే సలహాలతో చికిత్స చేశాడు. కొందరికి కావలసిన సిగరెట్లు, నికొటిన్ పాకెట్లు వెళ్ళాయి. వారి అవసరాలు కనిపెట్టి తీర్చడానికి 24 గంటలూ పనిచేసే ఒక కేంద్రాన్ని ఏర్పరిచారు.

అమెరికాలో ఓక్లే అనే ఓ నల్ల కళ్ళద్దాల కంపెనీ – 200 డాలర్లు ఖరీదు చేసే 35 జతల కళ్ళద్దాలను ఈ కార్మికులకు విరాళంగా ఇచ్చింది – కళ్ళను కాఫాడుకోడానికి. ఇందువల్ల ఆ కంపెనీకి జరిగిన మేలు ఏమిటి? ప్రపంచమంతా విస్తుపోయి, ఆతృతగా కొన్ని వేల గంటలు చూసిన ఈ వార్తా ప్రసారాలలో 70 రోజుల పాటు ప్రచారం ఆ కంపెనీకి జరిగింది. వారు పూనుకుని ఈ ప్రచారాన్ని జరపాలంటే 41 మిలియన్ల డాలర్లు ఖర్చు అయేదట! మరి ఈ రక్షణ కృషికి అయిన ఖర్చు? 20 మిలియన్ల డాలర్లు.

ఊహించలేని పరిస్థితులలో చావు ఒడిలో బతికి బట్టకట్టిన వ్యక్తులు ఒక పక్క, వాళ్ళని రక్షించడానికి ప్రపంచమంతా ఏకీకృతమయిన అపూర్వమయిన కృషి ఒక పక్క – ఇది గొప్ప అనుసంధానం. నిన్నటికి 33 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

మానవ ప్రయత్నానికి ఇంతకన్నా గొప్ప నివాళి ఉండదు.ఒకరినొకరు నరుక్కునే దయనీయమయిన నేపధ్యంలో ఇంత గొప్ప సహజీవనం మానవ హృదయంలోని అపురూపమైన ‘మమతానురాగాల’ కు గొప్ప ప్రతీక. దీనిని గ్రంధస్థం చేయగలిగితే ముందు తరాల వారు పదే పదే మననం చేసుకోడానికి ఇంతకంటే గొప్ప పుస్తకమూ ఉండదు.

***

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.