Main Menu

Gollapudi columns ~ Sanjay Vishada Yogam(సంజయ విషాద యోగం)

Topic: Sanjay Vishada Yogam(సంజయ విషాద యోగం)

Language: Telugu (తెలుగు)

Published on: March 25, 2013

Sanjay Vishada Yogam(సంజయ విషాద యోగం)     

భారత దేశం జాలిగుండె గల దేశం. దయకీ, కరుణకీ, ఆర్ధ్రతకీ, జాలికీ పెట్టింది పేరు. నిన్నకాక మొన్న తీహార్‌లో ఆత్మహత్య చేసుకున్న -ఢిల్లీ అమ్మాయిని ఘోరంగా మానభంగం చేసి చంపిన ఘనులలో ఒకడయిన రాంసింగ్‌ బతికి -17 సంవత్సరాల తర్వాత ఉరిశిక్ష విధిస్తే -అతని పట్ల 2030లో జాలి చూపే గుండె, కన్నీళ్లు పెట్టుకునే దయార్ధ్ర హృదయులు ఉంటారు. రాజీవ్‌ గాంధీతో పాటు ఏమీ నేరం చెయ్యని 18 మంది చచ్చిపోయినా -నళిని మీద సానుభూతి చూపే సోనియా కూతుళ్లూ, హంతకుల్ని ఉరితీయకూడదని ఒక రాష్ట్ర శాసనసభ తీర్మానం ఇందుకు సాక్ష్యం. మనది ఖర్మభూమి.

సునీల్‌ దత్‌ మానవత్వం మూర్తీభవించిన మహనీయుడు. నర్గీస్‌ కొన్ని దశాబ్దాలు ఈ దేశానికి ఆనందాన్ని పంచిన నటీమణి. సునీల్‌ దత్‌ మా గొల్లపూడి శ్రీనివాస్‌ ఫౌండేషన్‌ ప్రారంభ సమావేశంలో మొట్టమొదటి స్మారక ఉపన్యాసం ఇచ్చారు. నేను ముంబై వెళ్లి ఆయన్ని కలిశాను. ఆయన గదిలో ఆయన కుర్చీ వెనుక గోడమీద తల్లి ఫొటో. టేబిలు మీద భార్యతో చిన్న ఫొటో. నాతో గుమ్మందాకా నడిచి వచ్చి సాగనంపాడు. చివరిరోజుల వరకూ మా కుటుంబంతో సాన్నిహిత్యంగా ఉన్నారు. ఇంత చెప్పడానికి కారణం ఆయన సంస్కారాన్ని, ఆ కుటుంబం ఔన్నత్యాన్ని గుర్తుచేయడానికి.

తన కొడుకుని మాదకద్రవ్యాల నుంచి కాపాడడానికి సునీల్‌ దత్‌ ఎంత యాతన పడ్డారో ఒకసారి వివరించారు. వ్యసనం బలహీనత. కుసంస్కారం కాదు. అయితే సంజయ్‌ దత్‌ ఈ మారణాయుధాల ఇరకాటంలో పడేనాటికి 33 సంవత్సరాలు. అది పసితనం కాదు. పోలీసులకు కూడా అందుబాటులో లేని ఏకె -56 రైఫిల్స్‌, 9 ఎం.ఎం.పిస్టల్స్‌, హాండ్‌ గ్రెనేడ్స్‌, మందుగుండు సామగ్రి -యింత పెద్దమొత్తాన్ని తన దగ్గర దాచి ఉంచాడు. దుబాయ్‌ వెళ్లి -ఈ దేశద్రోహిగా ముద్రపడిన దావూద్‌ ఇబ్రహీంని కలిశాడు. ఆయన తన తమ్ముడు అనీస్‌ ఇబ్రహీంని, అబూ సలేంని, ఛోటా రాజన్‌నీ ఇతర మాఫియా కార్యకర్తల్ని పరిచయం చేశాడు. మారణాయుధాలను దాచడానికి పరువైన సంజయ్‌దత్‌ కుటుంబం ఉన్న ఇంటికంటే భద్రమైన స్థలం ఏముంటుంది? ఇది ఒక యెత్తు. తీరా 1993 ముంబై పేలుళ్లు జరిగాక, ప్రపంచం దిగ్భ్రాంతమయాక -272 మంది చనిపోయి, 700 మంది గాయపడ్డాక -సంజయ్‌ దత్‌ కిమ్మనలేదు. తీరా రహస్యం బయటపడ్డాక -ఆయుధాల్ని మాయం చెయ్యాలని ప్రయత్నించాడు. ప్రయత్నించలేదని కోర్టులో అబద్ధం చెప్పాడు. ‘టెర్రరిస్టు’ నేరం కింద అరెస్టయాక, తన కొడుకుమీద ‘టెర్రరిస్టు’ ముద్ర పడినందుకు సునీల్‌ దత్‌ ఎంత క్రుంగిపోయారో వర్ణనాతీతం. ఆయన పార్లమెంటు సభ్యులు. అయినా తన బిడ్డని జైలు నుంచి విడిపించుకోవాలని ఆయన చేయని ప్రయత్నం లేదు. కలుసుకోని నాయ కుడు లేడు. ఎవరూ అక్కరకు రాలేదు. నిజానికి రాలేని నేరమది. ఆఖరికి బాల్‌ థాకరే సహకరించారు. కొడుకు బయటికి వచ్చాడు -18 నెలల తర్వాత.

సంజయ్‌ దత్‌ కుటుంబ మర్యాద గొప్పది. రక్తంలో ఉన్న సంస్కారం గొప్పది. చట్టాన్ని గౌరవిస్తూ 17 సంవత్సరాలు గడిపాడు. ఈలోగా ఎన్నో చిత్రాలు. మున్నాభాయ్‌ పెద్ద హిట్‌ అయింది. నాకేమో మున్నాభాయ్‌ సినిమాలో కొడుకు అభివృద్ధిని చూసి పొంగిపోయిన సునీల్‌ దత్‌ పాత్ర నన్ను వణికించింది. అది ‘నటన’ కాదు. ఆయన కళ్లలో కన్నీళ్లు గ్లిసరీన్‌ కాదు. విలువైనవి. నిజమైనవి. నేను ఉత్తరం రాశాను. మున్నాభాయ్‌ కేవలం ఈనాటి సమాజం మీద సరదాగా చేసిన సమీక్ష. వాస్తవాల్ని ఎరగని ఓ రౌడీ -కేవలం గమ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవస్థని తలవొంచే ఓ పారిహాసిక. సబబైన ఏ ఆలోచనకూ లొంగని కథ. నేలబారు ప్రేక్షకులను కితకితలు పెట్టే అల్లిక. దానికి చాలారకాల మసిపూసి మారేడుకాయని చేశారు. ఒక విధంగా నికార్సయిన న్యాయానికి నిలబడని సంజయ్‌ ప్రవర్తనలోంచే మున్నాభాయ్‌ ఉద్బవించాడేమో! ఏమైనా మున్నాభాయ్‌ హాస్యం చెల్లింది. తన మోసానికి మున్నాభాయ్‌ చెప్పిన కారణాలకంటే సమాజపు నిర్లక్ష్యాన్ని ప్రేక్షకులు గుర్తుపట్టారు. ఇలాంటి కుక్కకి ఈ చెప్పుదెబ్బ సరైనదేనని చంకలు గుద్దుకున్నారు. అది ఒక అందమైన బుకాయింపు.

ఇప్పుడు సంజయ్‌ దత్‌కి శిక్ష పడింది. ఈ శిక్ష కొత్తకాదు. ఇలాంటి నేరానికే లోగడ జేబున్నిసా ఖాజీ అనే మహిళకు కనీసపు శిక్ష -అయిదేళ్లను కోర్టు విధించింది. చాలామంది నేరస్థులు చేసిన నేరాలకు శిక్షలు అనుభవిస్తున్నారు. మనం మనూశర్మ శిక్షకి ఇంతగా చలించలేదు. పండిత్‌ సుఖ్‌రాం శిక్షని పట్టించుకోలేదు. చంపరాని జంతువుల్ని చంపిన సల్లూభాయ్‌ (మన ప్రియతమ సల్మాన్‌ ఖాన్‌గారు) ఒక రాత్రి జైల్లో ఉంటారా లేదా అని బెంగపెట్టుకున్నాం.

సంజయ్‌ విషాదాన్ని సినీరంగంలో చాలామంది పంచుకుంటున్నారు. ఆయన ఇంతవరకూ అనుభవించిన యాతన పడిన మనోవేదన, శిక్ష చాలునని రామ్‌ జెత్మలానీ, మాజిద్‌ మెమూన్‌, మహేష్‌ భట్‌, ముఖేష్‌ భట్‌, జయా బచ్చన్‌, అజయ్‌ దేవ్‌గన్‌ వంటి వారెందరో అంటున్నారు. చాలామంది మంత్రులూ, ప్రభుత్వాలూ శిక్షని తగ్గించడమో, రద్దు చేయడమూ జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని వింటున్నాం. వీరందరూ ఒప్పుకునే నిజం ఒకటుంది. సంజయ్‌ దత్‌ చేయకూడని నేరం చేశాడన్నది. వీరంతా సమర్ధించే దొక్కటి ఉన్నది. సంజయ్‌ దత్‌ ఇప్పటిదాకా అనుభవించిన శిక్ష చాలునని. వారు కూడా అంగీకరించిన నేరం రుజువైనదే అయితే, లోగడ ఇలాంటి నేరాలకి పడిన శిక్ష ఒరవడిని గుర్తిస్తే -వారు అంగీకరించవలసింది శిక్షని నిర్ణయించాల్సింది వారి సానుభూతి కాదనీ, న్యాయస్థానమని.

ఫోకస్‌లో ఉన్న రంగంలో నేరం చేసినవారి నేరం మరింత ఫోకస్‌ లో కనిపిస్తుంది. అలాంటి నేరం నేలబారు మనిషి చేసిన నేరం కన్న వెయ్యిరెట్లు ఘోరమయినది. కారణం -రేపు ఆ ప్రముఖుడి నేరాన్ని -అతని పట్ల చూపిన ఔదార్యాన్ని కాదు -సామాన్యుడు ఆదర్శం చేసుకుంటాడు. మనకి నమ్మకాలు పోయాయి కాని -ఈ విషయాన్నే అలనాడు గీతాకారుడు చెప్పాడు: యద్యదాచరతి శ్రేష్ట: -అంటూ. సమాజంలో పెద్దరికం సానుభూతిని రాబట్టుకోడానికి కాదు -ఆదర్శం కావడానికి ఉపయోగపడాలి. రోడ్డుమీద పోలీసుని చంపించే మంత్రిగారు, మరణాయుధాల్ని నేరస్థులతో కుమ్మక్కయి దాచిన సినిమా హీరోగారు -సానుభూతిని నొల్లుకోవాలనుకోవడం -మరో మున్నాభా యి చేసిన సాహసం వంటిదే అవుతుంది. .

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.